“ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ శాఖకు ఎక్కువ… ప్రధాని పదవికి తక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారని” తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్.., “కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో గుక్కతిప్పుకోకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పగలరా?” అంటూ ప్రశ్నించారు.
తెలంగాణకు టీఆర్ఎస్ ఏం చేసిందో గుక్కతిప్పుకోకుండా అరగంటపాటు తాను చెప్పగలనని, మిషన్ భగీరథ ద్వారా నీరివ్వని పక్షంలో ఓట్లు అడగనని ప్రకటించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలకు తమ మాటలు అర్థం కావడం లేదని అందుకే ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదని తీవ్రంగా ఆయన మండిపడ్డారు. ప్రచారంలో అన్ని పార్టీల కంటే టీఆర్ఎస్ దూకుడుతో వ్యవహరిస్తుండడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.





