
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘ఒక్క ఛాన్స్’ అని అడిగినవారు, అధికారంలో వచ్చాక ‘ఎప్పటికీ మేమే ఉంటాము… లేదా ఉండాలి’ అన్నట్లు మాట్లాడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు.
అయితే మన ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యం కాదని అనేకమార్లు నిరూపితమైనప్పటికీ, అది తమ పార్టీకి వర్తించదనే భ్రమలో ఉండగానే అధికారం కోల్పోతారు కేసీఆర్‌లాగ!
ఈ ఓటమిని జీర్ణించుకోవడం కేసీఆర్, కేటీఆర్‌లకు చాలా కష్టమే. ఈలోగానే పార్టీ ఖాళీ అయిపోతుండటం, లోక్‌సభ ఎన్నికలు రెండూ కూడా మూలిగే నక్కపై తాటి పండు పడటమే.
పార్టీ నుంచి వెళ్ళిపోతున్నవారి గురించి కేటీఆర్ మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. “ఆనాడు కేసీఆర్ చేరదీసి పదవులిస్తే, వారందరూ ఇప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్ళిపోతున్నారు. తిరిగి కేసీఆర్ మీద నిందలు కూడా వేస్తున్నారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే హాయిగా నవ్వుకుంటూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు నేతలపై బిఆర్ఎస్ పగ తీర్చుకోవలసిందే.
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు పార్టీని వీడి వెళుతున్న నేతలే శాసనసభ ఎన్నికలలో పార్టీకి వెన్నుపోటు పొడిచారు.
అధికారం శాశ్వితమనుకొని వారు కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కానీ రేపు మనం అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా చేర్చుకునే ప్రసక్తే లేదు.
ఈ కుట్రలు, కుతంత్రాలను అన్నిటినీ చేధించగల ధీరుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలో నిఖార్సైన నాయకులు, ఉద్యమకారులతో పార్టీని పునర్నిర్మించుకుందాము,” అని కేటీఆర్ అన్నారు.
ఆనాడు బంగారి తెలంగాణ పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలను కేసీఆర్ ఇలాగే ఖాళీ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ వంటి ఉద్యమకారులను తరిమికొట్టి, ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలను తెచ్చుకున్నారు.
అప్పుడు విమర్శలు వస్తే ‘ఇప్పుడు మాది ఉద్యమ పార్టీ కాదు పక్కా రాజకీయ పార్టీ’ అంటూ కేసీఆర్ గట్టిగా సమర్ధించుకున్నారు కూడా. పదవులు పడేస్తే అందరూ తన కాళ్ళ దగ్గర కుక్కల్లా పడి ఉంటారనే అహంభావం కనబరిచారు.
అప్పుడు కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు నాయుడు ఆక్రోశిస్తుంటే కేసీఆర్ వారిని చూసి నవ్వేవారు. చాలా చులకనగా మాట్లాడేవారు.
కానీ ఇప్పుడు సరిగ్గా అటువంటి పరిస్థితే బిఆర్ఎస్ పార్టీకి ఎదురవుతుంటే ఈ నిర్వాకాలేవీ గుర్తులేన్నట్లు కేటీఆర్ ఆక్రోశిస్తున్నారు. ఫిరాయించినవారికి శాపాలు పెడుతున్నారు. ఆనాడు ఉద్యమకారులను పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు ఉద్యమకారులతో పార్టీని పునర్నిర్మించుకుంటామని చెపుతున్నారు!
మరో 25-30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని అన్న నోటితోనే ఇప్పుడు కేటీఆర్ అధికారం శాశ్వితం కాదని చెపుతున్నారు!
కనుక కేటీఆర్‌కు కాస్త ఆలస్యంగానైనా ప్రజాస్వామ్య తత్వం బోధపడిందని అర్దమవుతోంది. కానీ చేయకూడనివన్నీ చేసినా, తప్పులు చేశామని ఒప్పుకోకుండా, ఎదుటవారిని నిందిస్తుండటం, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కలలు కంటుండటం గమనిస్తే నేటికీ కేసీఆర్, కేటీఆర్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని అర్దమవుతోంది. కనుక పాత పాపాలతో పాటు కొత్త పాపాలకు కూడా ఫలితం అనుభవించక తప్పదు.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…