నిత్యం పోరాడుకునే బద్ధ శత్రువులకు ఉమ్మడి మిత్రుడు ఉంటారా? అంటే కొన్ని సందర్భాలలో ఉండొచ్చు. అలాంటిదే నాని హీరోగా చేసిన ‘ది ప్యారడైజ్’. తెలంగాణలో ఈ సినిమాకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రెండూ యధాశక్తిన మేలు చేశాయి.
ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకొని అదనపు షోలు వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించి సాయపడింది. తెలంగాణ నేపధ్యంలో తీసిన ఈ సినిమాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ని పోలిన పాత్ర ఉన్నందున, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ ముఖ్య నేతలను వెంటబెట్టుకొని సినిమా చూసొచ్చారు.
శనివారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సుదర్శన్ థియేటర్లో ఈ సినిమా చూసొచ్చి చాలా అద్భుతంగా ఉందని కేటీఆర్ మెచ్చుకున్నారు. తద్వారా రివ్యూలతో కంగు తిని మళ్ళీ పుంజుకుంటున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకి ఉచిత పబ్లిసిటీ లభించినట్లయింది.
కేటీఆర్ చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ సినిమాకు క్యూకట్టే అవకాశం కూడా ఉంటుంది.
ఈవిధంగా అధికార, ప్రతిపక్షాలు ‘ప్యారడైజ్’కు సాయపడి గట్టెకించేయడం ఆ సినిమా దర్శక నిర్మాతలు, నాని అదృష్టమనే చెప్పాలి.
ఒకవేళ ఈ సినిమా చూసిన తర్వాత కేసీఆర్ పాత్రపై కేటీఆర్ ఏమాత్రం అసహనం వ్యక్తం చేసినా సినిమా పరిస్థితి తారుమారు అయ్యి ఉండేది కదా? కనుక నిత్యం పోరాడుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ‘ప్యారడైజ్’కు తోడ్పడటం దాని అదృష్టమనే చెప్పాలి.





