నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికై దాదాపు 20 నెలలు పూర్తవుతున్నాయి. ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కువ శాతం ప్రజలు ఆయన వైపుకే మొగ్గు చూపుతున్నారని ‘ఏబీపీ న్యూస్ – నీల్సన్’ నిర్వహించిన సంయుక్త సర్వే చెబుతోంది. మోడీ సర్కారుపై ప్రజల అభిప్రాయం ‘పాస్ మార్కులను’ దాటిందనేది ఈ సర్వే సారాంశం.
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్)కు 301 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైన అంశం. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో, 36 శాతం మంది మోడీ పాలన ‘చాలా బాగుంది’ లేదా ‘బాగుంది’ అని సమాధానం ఇచ్చారని తెలిపింది. అలాగే ఎన్డీయేకు 38 శాతం ఓట్లతో 301 సీట్లు రావచ్చని తెలిపింది.
కాగా, మే 2014లో ఎన్డీయే సాధించిన 339 సీట్లతో పోలిస్తే 38 సీట్లు తక్కువగా ఉండగా, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 28 శాతం ఓట్లు పడవచ్చని, ఆ పార్టీ సీట్ల సంఖ్య 62 నుంచి 108కి పెరగవచ్చని అంచనా వేసింది. మిగతా అన్ని ప్రాంతీయ పార్టీల కన్నా అధికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 4 శాతం ఓట్లు దక్కవచ్చని వెల్లడించింది.





