
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే సమయంలో ఒకే స్థాయిలో వరదలు రావడంతో ‘రాజకీయ బురద’ అటూ ఇటూ వ్యాపిస్తోంది. ఈ వయసులో కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని విజయవాడలో మకాం వేసి సహాయ, పునరావాస చర్యలు జోరుగా జరిపిస్తుంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ముంపు ప్రాంతాలలో మొక్కుబడిగా పర్యటించి వెళ్ళిపోయారని బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోమని హితవు పలుకుతున్నారు.
అయితే వారికి సిఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా సమాధానం చెపుతూ, “నేను, మంత్రులు అందరూ మూడు రోజులుగా నిద్రాహారాలు మాని పనిచేయడం వలననే విజయవాడతో పోలిస్తే ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో నష్టం తగ్గించగలిగాము. సిఎం చంద్రబాబు నాయుడు బాగా పనిచేస్తే చాలా సంతోషమే.
కానీ ఆయన గురించి మాట్లాడుతున్న మీకు (బిఆర్ఎస్ నేతలకు) అక్కడి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారో, వరద బాధితులను పరామర్శిస్తున్నారో కనిపించలేదా?ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుంటే, మీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో జల్సా చేస్తున్నాడు.
మీరు (హరీష్ రావు) తెలంగాణ భవన్‌లో కూర్చొని ప్రెస్‌మీట్ పెట్టి, పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రజలకు ఇంత కష్టం వచ్చినా వెళ్ళి పరామర్శించని మీ అధినేత కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది,” అని అన్నారు.
తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు పరస్పరం విమర్శించుకోవడం మామూలేకానీ ఈవిదంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డిని పేర్కొంటూ పరస్పరం విమర్శించుకోవడమే కాస్త విచిత్రంగా ఉంది.
ఇదివరకు అంటే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ పాలిస్తున్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు వంటి బిఆర్ఎస్ పార్టీ నేతలు తమ పాలనలో తెలంగాణ ఎంత గొప్పగా ఉందో చెప్పుకోవడానికి “ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి” అంటూ పోల్చి మాట్లాడేవారు. ఇప్పుడు అదే బిఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో చురుకుగా పనులు సాగుతున్నాయంటూ తమ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసుకుంటున్నారు. ఈ పోలికలు… ఈ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి కదా?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…