తెలుగువారి పండుగలలో అతిపెద్ద, ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి తన దిశను మార్చుకునే ప్రక్రియలో మకర రాశిలోకి ప్రవేశించే సమయాన సంక్రాంత్రి సంబరాలు జరుపుకుంటారు. ఇంటి ముందు రంగు రంగుల రంగవల్లెలతో, గొబ్బెమ్మలతో, హరిదాసుల భజనలతో, గంగిరెద్దుల కోలాహలంతో ప్రతి పల్లె సొంతవారి ఆప్యాయతలతో పులకరిస్తుంది.
పంట చేతికొచ్చిన రైతుల కష్టంతో భోగభాగ్యాలతో పల్లెలు కళకళలాడుతాయి. భోగీ మంటల కాంతులతో మొదలైన సంక్రాంతి సంబరాల సరదాలు మూడు రోజుల పాటు కొనసాగుతూనే ఉంటాయి. కోడి పందాలు, ఎడ్ల పందాలతో పెద్దలు హడావుడి చేస్తుంటే ఆకాశంలో ఎగిరే పతంగుల పోటీలతో పిల్లలు కుస్తీ పడుతుంటారు. కొత్త అల్లుళ్ళ మర్యాదలు, సరదా సరదా సంభాణలు ఒక పక్క, విడుదలైన తెలుగు సినిమాల పోటీ మరో పక్కతో అటు వినోదాన్ని ఇటు ఆహ్లాదాన్ని ఒకేసారి రుచి చూస్తారు.
పిండివంటలు, బొమ్మల కొలువులు, ముగ్గుల పోటీలతో మహిళలు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. పట్టణ వాసులు పల్లెబాట పట్టి తమ సొంత వారిని, సొంత ఊరుని కలుసుకుని అందరు కలిసి సంతోషంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ సంక్రాంత్రి పండుగ. ఈ తరం వారు, పాత తరం వారి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, తెలుగు సంస్కృతిని ముందు తరానికి అందించాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ “m9 సంక్రాంతి శుభాకాంక్షలు” తెలియచేస్తుంది.




