టాలీవుడ్ లో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకోబోతోంది. సాధారణంగా వారసుల వేడుకలకు తండ్రులు ముఖ్య అతిధులుగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపి, ఆ కార్యక్రమానికి హైలైట్ గా నిలుస్తారు. కానీ, ఒక తండ్రి సినిమాకు కొడుకు ముఖ్య అతిధిగా విచ్చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి సంఘటన ఫిబ్రవరి 18వ తేదీన జరగబోతుందని సమాచారం.
సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం “శ్రీశ్రీ.” ఈ సినిమా ఆడియో ఆవిష్కరణకు ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేయబోతున్నారని సమాచారం. ఫిబ్రవరి 18వ తేదీన శిల్పకళావేదికలో ఈ ఆడియో ఆవిష్కరణ వేడుక ముహూర్తాన్ని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రిన్స్ మిక్కిలి ప్రాధాన్యత ఇవ్వడంతో “శ్రీశ్రీ”పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తానని మహేష్ బాబే స్వయంగా చిత్ర దర్శకుడిని కోరారని ఇటీవల జరిగిన ప్రచారం తెలిసిందే. చాలా కాలం తర్వాత కృష్ణ వెండితెరపై దర్శనమిస్తుండడంతో అభిమాన వర్గం ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ రచయిత శ్రీశ్రీ కధ ఆధారంగా రూపొందినట్లు టాక్.





