రాజకీయ పరమైన అంశాలకు చాలా దూరంగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్న దాఖలాలు కూడా లేవు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో గానీ, అంతకు ముందు ఎన్నికలలో గానీ ఎప్పుడూ పోలింగ్ బూతు పరిసరాల్లో దర్శనమివ్వలేదు. అయితే నేడు జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మహేష్ ఓటు వేయనున్నారా? వేస్తే ఏ పార్టీకి వేస్తారు? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
అసలు ఈ అంశాలన్నీ తెరపైకి రావడానికి కారణం… ప్రిన్స్ చేసిన ట్వీట్. “ప్రతి ఓటు కౌంట్ అవుతుంది, తప్పకుండా వెళ్లి ఓటు వేయండి” అంటూ జీహెచ్ఎంసీకి చెందిన ఫోటోను షేర్ చేసుకున్నారు. అంటే మొదటిసారిగా మహేష్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ప్రిన్స్ ఓటు ఏ పార్టీకి పడనుంది… తన బావ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకా? లేక కేటీఆర్ తో ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారా? ఈ విషయంలో ప్రిన్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారా..!





