సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్న “గౌతమ్ నంద” సినిమా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. థమన్ స్వరపరిచిన ఆడియో శ్రోతలను అలరిస్తుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ‘శ్రీమంతుడు’ తరహాలో ఫుల్ సౌండ్ పార్టీ హీరోగా ‘గౌతమ్ నంద’ పాత్రలో గోపీచంద్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ పాత్రకు ఇంటి పేరుగా ప్రిన్స్ మహేష్ బాబు ఇంటి నామధేయం వినియోగించడం విశేషం. అవును… ఘట్టమనేని గౌతమ్ నందగా గోపిచంద్ ఈ సినిమాలో పిలిపించుకోబోతున్నాడు. సర్వ సాధారణంగా టాప్ హీరోల ఇంటి పేర్లను వారి వారి సినిమాలకే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ మహేష్ బాబు ఇంటి పేరును గోపీచంద్ సినిమాకు వాడుకోవడం అనేది విశేషం. ఇలా వినియోగించినపుడే అభిమానులు తెరపైకి వస్తుంటారు.
అంతా బాగున్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏదైనా ఒకటి, రెండు సన్నివేశాలలో అభ్యంతరకంగా, అందులోనూ కులాన్ని హైలైట్ చేసే విధంగా ఉంటే మాత్రం, అది విమర్శలకు తావిస్తుంది. ‘ఘట్టమనేని’ అంటే ఒక్క కృష్ణ కుటుంబమే కాదు గానీ, ఒక సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ వలనే ‘ఘట్టమనేని’ అన్న పదం హైలైట్ అయ్యిందన్నది వాస్తవం.



