పెళ్ళైన తరువాత నాగచైతన్య, సమంత జంటగా నటించిన మొదటి చిత్రం ‘మజిలీ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ ఒక మిడిల్ క్లాస్ తండ్రి (రావు రమేశ్) తన కొడుకుతో (నాగ చైతన్య) చెప్పే డైలాగ్‌తో, నాగచైతన్య క్రికెట్ ఆడుతున్న సన్నివేశంతో టీజర్ మొదలైంది.
సినిమాలో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరుగుతుంది. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక చైతూ సమంతను దూరం పెడతాడు. ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య సమంతతో అంటాడు. దర్శకుడు శివ నిర్వాణ తన గత సినిమా నిన్ను కోరి లాగే ఒక హత్తుకునే ప్రేమకథ ను ఎంచుకున్నారు. ఆ సినిమాను తీసినట్టే గుండె హత్తుకునేలా తీస్తే నాగ చైతన్యకు హిట్ లభించినట్టే.
విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సమంత రైల్వే క్లర్క్ గా కనిపించనుంది. టీజర్ ను బట్టి చైతన్య సమంత జోడీ అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్య తన గత మూడు సినిమాలతో మూడు ప్లాపులు ఇచ్చారు (యుద్ధం శరణం, శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి). ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది.



