విజయనగరం వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మొదటి ఎదురుదెబ్బ మేనల్లుడు చిన్నశ్రీను పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపిలో చేరిపోయినప్పుడు తగిలింది.
రెండో ఎదురు దెబ్బ పరిషత్ ఎన్నికల్లో బొండపల్లి నుంచి పోటీ చేసిన కూతురు అనూష టీడీపి అభ్యర్ధి పాశాల నీరజ చేతిలో ఓడిపోయినప్పుడు తగిలింది.
మూడో ఎదురు దెబ్బ విజయనగరం జడ్పీ చైర్మన్ పదవిలో తన కూతురు అనూషను కూర్చోబెడదామనుకుంటే, చిన్న శ్రీను కుమార్తె మజ్జి సిరి సహస్ర కూర్చోబోతుండగా తగిలింది.
ఇలా ఎందుకు జరిగింది అంటే చిన్న శ్రీను పార్టీని వీడి వెళ్ళిపోవడం వల్లనే. అయితే చిన్న శ్రీను ఆ పదవిలో ఉండగానే బొత్స సత్యనారాయణ తన కూతురు అనూషను ఆ కుర్చీలో కూర్చోబెడతానని ప్రకటించారు. కనుక అయన పార్టీ వీడటానికి ఇదీ ఓ కారణమై ఉండవచ్చు.
జిల్లా వైసీపీకి బొత్స పెద్ద దిక్కుగా ఉన్నప్పటికీ మజ్జి శ్రీను పార్టీ కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. అయితే మర్రి చెట్టు నీడలో ఏ మొక్క పెరగనట్లే బొత్స సత్యనారాయణ నీడలో తాను కూడా రాజకీయంగా ఎదగలేనని చిన్న శ్రీను బాగానే గ్రహించారు.
కనుక జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు సాధించిన తర్వాత ఈ ఎన్నికలకు ముందు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి కూతురు మజ్జి సిరి సహస్రతో సహా సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి టీడీపిలో చేరిపోయారు.
ఆ తర్వాత పరిషత్ ఎన్నికల్లో మజ్జి సిరి సహస్ర బొబ్బిలి నియోజకవర్గంలోని తెర్లాం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆమెకు విజయనగరం జడ్పీ చైర్ పర్సన్ పదవి లభించింది.
ముందుగా కూతురు మజ్జి సిరి సహస్రను తాను ఖాళీ చేసిన జడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. తద్వారా జిల్లా స్థాయి పదవులలో బొత్స వారసత్వానికి ప్రస్తుతానికి చిన్న బ్రేక్ వేశారని చెప్పవచ్చు.
తర్వాత జిల్లా రాజకీయాలలో చిన్న శ్రీను శకం మొదలవుతుందా?లేక జిల్లాలో టీడీపి పెద్ద దిక్కు అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని గౌరవిస్తూ టీడీపి నాయకుడుగా ముందుకు సాగుతారా? చూడాలి!





