రాజకీయ రంగు పులుముకున్న హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యపై మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా స్పందించారు. అంతేకాదు, ఈ ఉదంతంలో రాజకీయ పార్టీలు, ఆయా పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా మంచు విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలతో టాలీవుడ్ వర్గాలతో రాజకీయ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు.
“అన్యాయం జరుగుతోందని రోహిత్ గట్టిగా కేకలు వేసినప్పుడు ఆ కేకలు ఎవ్వరికీ వినపడలేదు. ఇప్పుడు ఆ కేకలు కాస్త చావు కేకలై గట్టిగా వినిపిస్తున్నాయని” విష్ణు తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. రోహిత్ మృతి పై పార్టీలు, నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డ విష్ణు, రోహిత్ వేముల లాంటి కుర్రాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారన్నారు. సమాజంలో మానవత్వం మంటగలిసిందని.. కనీసం రోహిత్ మృతి చెందాడన్న విషయాన్నైనా గుర్తించారని ఆవేశపూరిత ట్వీట్లు చేశారు. రోహిత్ విషయంలో ముందే స్పందించి ఉంటే ఆయన బతికేవాడని, ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నవారంతా అప్పుడేమయ్యారని ప్రశ్నించారు.





