మంగళగిరిలో వైసీపీ ఇంచార్జ్ ల మార్పు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల ముందు నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు గమనిస్తే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అనేక కీలక మార్పులు చేసింది.
నియోజవర్గ ఎమ్మెల్యే ల మార్పు అనే ఆలోచనలతో 2024 ఎన్నికలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనేకమంది వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ల నియోజకవర్గాలను మార్పులు చేసారు. అందులో మంగళగిరి ఒకటి.
ఆ ప్రక్రియలో భాగంగా మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ని పక్కన పెట్టి వైఎస్ జగన్ ఆ స్థానంలో టీడీపీ నుంచి వలస వచ్చిన గంజి చిరంజీవిని నియమించాలని భావించారు. అయితే తన సిట్టింగ్ స్థానాన్ని తనకు కాకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నేతకు కట్టబెట్టడంతో నాడు జగన్ పై అలిగిన ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
అయితే ఆర్కే పార్టీ మార్పు మూన్నాళ్ళ ముచ్చట అన్నట్టుగా కాంగ్రెస్ లోకి ఇలా వెళ్లిన ఆర్కే అలా వైసీపీలోకి తిరిగొచ్చేశారు. అసలు వైసీపీ ని ఎందుకు వీడారో, కాంగ్రెస్ లో ఎందుకు చేరారో, తిరిగి వైసీపీ లోకి రీ ఎంట్రీ ఎందుకు ఇచ్చారో అనే స్పష్టత వైసీపీ క్యాడర్ కి కూడా ఇవ్వలేకపోయారు ఆర్కే.
అయినా కూడా వైసీపీ అధిష్టానం ఆర్కేకు మంగళగిరి బాధ్యతలు అప్పగించలేకపోయింది. చివరికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్య ను తెరమీదకు తెచ్చిన జగన్ ఆర్కే రాజకీయ జీవితానికి పరోక్షంగా అక్కడితో సమాధి కట్టేసారు.
2024 ఎన్నికలలో నారా లోకేష్ దాటికి పోటీలో కూడా నిలవలేకపోయిన వైసీపీ ఆ నష్టాన్ని దొంతి రెడ్డి వేమారెడ్డి తో భర్తీ చేయాలనీ చూసినా ఫలితం శూన్యమని తేలింది. దొంతిరెడ్డి వేమారెడ్డి ఒకరకంగా ఆర్కే వర్గానికి సొంత ప్రత్యర్థి కావడంతో ఇక వైసీపీలో ఆర్కే కథ ముగిసినట్టే అనే భావనలోకి వచ్చేసారు వైసీపీ క్యాడర్.
మంగళగిరి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న వేమారెడ్డి స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారనే భావనతో ఆయన స్థానంలో తాజగా బుర్రముక్కల వేణు ని వైసీపీ తెరమీదకు తెచ్చింది. అయితే బుర్రముక్కల వేణు లోకేష్ స్థాయికి సరితూగుతాడా.? అన్న సందేహం ఆ పార్టీ క్యాడర్ నుంచే బలంగా వ్యక్తమవుతోంది.
మంగళగిరిలో వైసీపీ ప్రస్తుత రాజకీయ దుస్థితి చూసిన సొంత పార్టీ శ్రేణులే వీరందరి బదులుగా నాడు 2019 లో లోకేష్ ని ఓడించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించి వైసీపీ జెండాను గెలిపించిన ఆర్కే ని వైసీపీ అధిష్టానం ఎందుకు పక్కన పెడుతుంది అంటూ నిట్టూరుస్తున్నారు.
ఆర్కే వంటి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న నేతను పక్కన పెట్టి జగన్ ఎందుకు ఇలా గుర్తింపు లేని నేతలను తెరమీదకు తెస్తున్నారు.? అసలు ఆర్కే మొత్తం రాజకీయాలకు దూరమయ్యారా.? లేదా సాయిరెడ్డి మాదిరి జగన్ కోటరీ రాజకీయంతో వైసీపీ పార్టీకి దూరమయ్యారా.? ఆర్కే ఎక్కడ.?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆళ్ళ రాజకీయం ముగిసిందా.? లేదా వైసీపీ పార్టీలో ఆళ్ళ రాజకీయానికి ఎండ్ కార్డు పడిందా.? అనే ప్రశ్నలు వైసీపీ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మరి సొంత పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఈ ప్రశ్నలకు పార్టీ అధినాయకత్వం కానీ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కానీ బదులు చెప్పగలరా.?







