మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమాకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ‘కత్తి’ సినిమా స్టోరీ తనదేనంటూ రచయిత నరసింహారావు పోరాటం మొదలుపెట్టారని ట్రేడ్ వర్గాల టాక్. ఈయనకు న్యాయం చేసిన తర్వాతే సినిమా నిర్మాణం చేయాలని కథా హక్కుల వేదిక ఛైర్మన్, దర్శకుడు దాసరి నారాయణరావు తీర్మానించారు. అయితే, ఈ తీర్మానాన్ని ఉల్లంఘించి నిర్మాణం పనులు జరుగుతుండడంతో దర్శకుల సంఘం, సినీ కార్మికుల ఫెడరేషన్ సంయుక్తంగా సహాయ నిరాకరణకు దిగాయి.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తుండగా, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు వీవీ వినాయక్, రచయితలు పరుచూరి బ్రదర్స్ కూడా ఫెడరేషన్‌లో సభ్యులే కావడంతో వాళ్లకీ ఈ సహాయ నిరాకరణ వర్తిస్తుందనేది సినీ కార్మికుల వాదన. దీంతో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పరిస్థితి ఏంటి? అంటూ మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా తనకు తగ్గ కధ దొరకడం లేదని చెప్తూ, సినిమాను వాయిదాలు వేసిన చిరంజీవి ఎట్టకేలకు తమిళ “కత్తి” సినిమా రీమేక్ కు తలూపారు. దీంతో నేడో రేపో సెట్స్ పైకి వెళ్లబోతుందని మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ సినిమా కధ తనదేనంటూ రచయిత నరసింహారావు రంగంలోకి దిగడంతో కొత్త “ట్విస్ట్” ఎదురయ్యింది.





