వైసీపీ నుండి 20వ ఎమ్మెల్యేగా అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాధ్ రెడ్డి, జగన్ మీడియా మరియు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. అసలు తానూ ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే తనను 30 కోట్లు, 40 కోట్లు పెట్టి కొనుగోలు చేసారని జగన్ మీడియాలో రాసిన రాతల వలన స్పందిస్తున్నానని చెప్పిన అమరనాధ్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ఒకప్పుడు తానూ టిడిపి నుండి వైసీపీలోకి వచ్చినపుడు మీరు ఎంతకు కొన్నారో చెప్పగలరా? అంటూ సూటిగా ప్రశ్నించిన రెడ్డి, తన క్యారెక్టర్ పై మచ్చ తెచ్చే రాతలు రాస్తే ఊరుకునే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఆనాడు ఒక శాసనసభ్యుడిగా వెళ్లాను, ఈనాడు శాసనసభ్యుడిగానే వచ్చాను… అయినా ఛాలెంజ్ చేస్తున్నా… నేను రాజీనామా చేసి గెలుస్తా… నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా… అదే నేను గెలిస్తే పార్టీ మూసేస్తావా అంటూ సవాల్ విసిరారు.
మరొక ఎమ్మెల్యే గురించి నాకు తెలియదు గానీ, నేను ఎలాంటివి తీసుకోలేదని కాణిపాకం వినాయకుడిపై, తిరుమల వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేస్తా… అవసరమైతే నా ఒక్కగానొక్క బిడ్డ నా కొడుకుపై కూడా ప్రమాణం చేస్తా… నువ్వు నీ కూతుళ్ళపై గానీ, నువ్వు నమ్మే ఏసుక్రీస్తుపైన గానీ ప్రమాణం చేస్తావా… అంటూ ధ్వజమెత్తారు. నేనేంటో నీకు తెలుసు… ఈ అమరనాధ్ ఏంటో నీకు తెలుసు… అలాంటి నాపై నీ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తే… నా నోటికి ఎవరూ తట్టుకోలేరు… గుర్తు పెట్టుకోండి… అంటూ ఒక విధమైన హెచ్చరికలను జారీ చేసారు.
దమ్ము… ధైర్యం ఉంటే రా… ఇలాంటి చవకబారు రాజకీయాలు నా దగ్గర మాత్రం చేయవద్దు… ఒకవేళ అలాంటివి చేస్తే నేను ధీటైన సమాధానం చెప్తా… అంటూ పలికిన అమరనాధ్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనుభవ పూర్వకంగా రాజకీయాలు చేసే తనను కెలకవద్దని అమరనాధ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ వర్గాలు ప్రతిస్పందించకపోవడం విశేషం.





