కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి, సీజేపీ చేస్తున్న ఆందోళనలను నిశితంగా గమనిస్తే భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో అర్ధమవుతుంది.
మోడీ ప్రభుత్వం మొదట ఈ ఆందోళనలను లైట్ తీసుకొని ఒకసారి మూల్యం చెల్లించింది. ఒకవేళ ఇప్పటికీ ఈ సమస్యను సమర్దంగా పరిష్కరించుకోలేకపోతే, రాహుల్, దీప్కే, ప్రకాష్ రాజ్‌లు కోరుకుంటున్నట్లే భవిష్యత్‌లో మోడీ ప్రభుత్వం గద్దె దిగాల్సి రావచ్చు.
కనుక ఈ తాజా ఆందోళనలపై మోడీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో, రాజకీయంగా ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
భవిష్యత్ పరిణామాలు బహుశః ఇలా ఉండవచ్చు. దేశంలో ప్రధాని మోడీని, బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు, శక్తులు తాజా ఆందోళనలకు మద్దతు ఇస్తుండటం గమనిస్తే, వచ్చే ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వీరందరూ చేతులు కలుపబోతున్నారని స్పష్టమవుతోంది.
ఈ వేడి ఏ మాత్రం తగ్గినా మళ్ళీ ఇంత పెద్ద ఉద్యమం, ఇంత మంది మద్దతు కూడగట్టడం చాలా కష్టం. కనుక ఈ రాజకీయ శక్తులన్నిటినీ ఇలాగే బలంగా కలిపి ఉంచేందుకు, న్యూట్రల్‌గా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను కూడా ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ, సీజేపీలు ఈ ఆందోళనలు ఇలాగే కొనసాగిస్తూ ఉండవచ్చు.
ఒకవేళ ఈ మోడీ-బిజేపి వ్యతిరేక శక్తుల ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే ఎన్నికలలో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదు. అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మార్పు మాత్రమే కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ముఖ్యంగా కూటమి పార్టీలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునేందుకు తెర చాటున చర్చలు జరుగుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ ఆందోళనలతో కేంద్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉందనే నమ్మకం ఏర్పడితే, వైసీపీతో దేశంలో పలు పార్టీలు ఇండియా కూటమిలో చేరవచ్చు.
కనుక ఈ తాజా పరిణామాలు ఏపీలో కూటమి పార్టీలకు ప్రమాద హెచ్చరికల వంటివే అని చెప్పక తప్పదు.
దేశ రాజకీయాలను శాసిస్తున్న మోడీ, అమిత్ షాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్న చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ తెలియవని అనుకోలేము. కానీ ముగ్గురూ మౌనంగా జరుగుతున్న ఆందోళనలను చూస్తున్నారు.
కనుక ఎప్పుడు ఎవరు ఏవిధంగా పావులు కదుపుతారో.. ఈ పవర్ పాలిటిక్స్‌లో ఎవరు అంతిమ విజయం సాధిస్తారో కాలమే చెపుతుంది.





