తప్పులు సరిదిద్దుకునేందుకు అహం అడ్డయితే ఎవరికి నష్టం?

Jagan and the Amaravati capital policy debate

ఏపీ రాజకీయాలలో పాతుకుపోయిన టీడీపిని ఓడించి వైసీపీని ఒంటి చేత్తో గెలిపించుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆయన కారణంగానే వైసీపీ 2019 ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయింది కూడా. అంటే వైసీపీకి బలం, బలహీనత రెండూ ఆయనేనన్న మాట!

రాజకీయ పార్టీల కొన్ని ఆలోచనలు, విధానాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తుంటాయి. ఈ విషయం కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీలకు, వాటి అధినేతలు, నేతలకు తెలియదనుకోలేము.

ADVERTISEMENT

తమది తప్పుడు విధానమని ఒకవేళ వారు గుర్తించలేకపోయినా, మీడియా, వారి రాజకీయ ప్రత్యర్థులు హెచ్చరికలతో అప్రమత్తం చేసి తప్పు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. కానీ దేశంలో చాలా పార్టీలు మొండిగా తప్పుడు విధానాలతో ముందుకు సాగి ఎదురుదెబ్బలు తింటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి అటువంటిదే.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రత్యర్థే తప్ప శత్రువు కాదు. కానీ ఆయనపై ద్వేషంతో ఆయన చేపట్టే ఏ పనినైనా గుడ్డిగా వ్యతిరేకించడమే పార్టీ విధానంగా మార్చేసుకున్నారు.

అమరావతి మొదలు అన్నా క్యాంటీన్ల వరకు ప్రతిదీ వ్యతిరేకిస్తూ చివరికి తనను, తన పార్టీని నష్టపరుచుకున్నారు. కానీ నేటికీ ఆయన వైఖరిలో మార్పు రాలేదని మంత్రి నారా లోకేష్‌ అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణ ఖర్చులపై చెప్పిన తప్పుడు లెక్కలే ఇందుకు నిదర్శనమన్నారు.

అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్లపై కూటమి ప్రభుత్వం చ. అడుగుకు రూ.30,000 ఖర్చు చేస్తోందని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ఆరోపణలపై వెంటనే స్పందిస్తూ, 5 ఐకానిక్ టవర్ల విస్తీర్ణం 52.20 లక్షల చదరపు అడుగులు కాదు… 71.43 లక్షల చదరపు అడుగులని పేర్కొంది.

విస్తీర్ణం తక్కువగా పేర్కొంటూ వాటిపై భారీగా ఖర్చు చేస్తున్నట్లు జగన్‌ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిపింది. ఐకానిక్ టవర్ల విస్తీర్ణం 71.43 లక్షల చ. అడుగుల లెక్కన చ. అడుగుకు కేవలం రూ.17,339 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కనుక అమరావతి నిర్మాణ పనుల వ్యయంపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

నాడు అమరావతిని వద్దనుకోవడం, అందుకోసం మూడు రాజధానులు, విశాఖ రాజధాని, మావిగన్‌ అంటూ జగన్‌ పదేపదే ఆలోచనలు మార్చుకోవడం స్పష్టత లేకపోవడం వల్లనే అని అందరూ భావిస్తుంటారు.

కానీ అసలు కారణం అది కాదు. చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత, ద్వేషంతోనే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారని చెప్పక తప్పదు.

అయితే జగన్‌ మాటలు, ఈ వైఖరే వైసీపీ విధానంగా పరిగణించబడుతున్నాయి. కనుక రాజధానితో సహా పలు అంశాలలో ఇటువంటి విధానపరమైన లోపాల కారణంగానే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారు. ఇది కేవలం విధానపరమైన లోపం మాత్రమే కాదు… ఆ లోపాన్ని అంగీకరించి సరిదిద్దుకోలేని అహంభావం కూడా కనిపిస్తోంది. ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో కూడా తిరస్కరిస్తారని గ్రహిస్తే వైసీపీకే మంచిది.

ADVERTISEMENT
Latest Stories