కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో నిర్వహించిన ‘పైలట్ ప్రాజెక్ట్’ విజయవంతమైందని భావించిన సీజేపీ.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ముంబై, బెంగళూరు నగరాల్లో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పటివరకు సీజేపీని ముందుపెట్టి కథ నడిపించిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కూడా ఈసారి నేరుగా రంగంలోకి దిగి నిరసనలు ప్రారంభించాయి. దీంతో సీజేపీ వెనుక కాంగ్రెస్ మద్దతు ఉందనే విమర్శలకు మరింత బలం చేకూరినట్లయింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ పార్టీ మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటున్నది కూడా తెలంగాణ పోలీసులే. కానీ ఆ అరెస్టులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విమర్శలు చేయడం మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నామని చెబుతున్నారు. మరోవైపు సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే బెంగళూరులో నిర్వహిస్తున్న సభలో ప్రధాని మోడీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
మోడీని ‘ఓట్ల దొంగ’గా అభివర్ణిస్తూ.. ఓట్లు దొంగిలించి అధికారంలోకి వచ్చారని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని దీప్కే ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దేశానికి బలమైన పునాదులు వేశారని, మోడీ కాదని అన్నారు. మతం పేరుతో ప్రజలను విభజిస్తున్న మోడీ, బీజేపీని గద్దె దించాల్సిందేనని పిలుపునిచ్చారు.
జెన్-జీ ప్రతినిధిగా చెప్పుకునే అభిజీత్ దీప్కే సొంతంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసి ఉంటే.. ప్రజలు వాటిపై ఆలోచించాల్సిందే. కానీ ఆయన నోట వినిపిస్తున్న మాటల్లో చాలావరకు రాహుల్ గాంధీ తరచూ చేస్తున్న విమర్శలే కనిపిస్తాయి.
ఒకవేళ సీజేపీకి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల మద్దతు లేకపోతే ఈ స్థాయిలో ఉద్యమాన్ని విస్తరించగలరా? అందుకే ఈ రాజకీయ బొద్దింకల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
సరే.. ప్రధాని మోడీ, బీజేపీ వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడిందని భావిస్తే.. గద్దె దించేద్దాం. కానీ ఆ తర్వాత దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? రాహుల్ గాంధీ? అభిజీత్ దీప్కే? ప్రకాష్ రాజ్?
“రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడమే నా లక్ష్యం” అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరచూ చెబుతుంటారు. ఇది రాహుల్ పట్ల విధేయతగా కనిపించవచ్చు. కానీ ఆయనకు నాయకత్వ పటిమ లేదని చేపుతున్నట్లే అనిపిస్తుంది కదా?
కనుక మోడీని గద్దె దించాలనుకునే కాంగ్రెస్.. ఆయనకు ధీటుగా దేశాన్ని నడిపించగల నాయకత్వాన్ని కూడా ప్రజలకు చూపించాలి కదా?
కేవలం మోడీని వ్యతిరేకించడం, గద్దె దించడం గురించి మాట్లాడితే సరిపోదు. మోడీ స్థానంలో దేశాన్ని సమర్థంగా నడిపించగల వ్యక్తి ఎవరనేది ఖచ్చితంగా చెప్పగలగాలి.
ఇదివరకు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలన ఎలా సాగిందో దేశ ప్రజలకు తెలియనిది కాదు. కాంగ్రెస్ హయంలో దేశంలో జరిగిన ఉగ్రదాడులు, అవినీతి, కుంభకోణాలు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట కోల్పోవడం వంటివి దేశ ప్రజలు మర్చిపోలేదు.
అలాగని మోడీ ప్రభుత్వం సర్వరోగ నివారిణి కూడా కాదు. ప్రతీ ప్రభుత్వానికీ కొన్ని బలాలు, లోపాలు ఉంటాయి. అలాగే దీనికీ ఉంటాయి. వాటిని తప్పక ప్రశ్నించాల్సిందే.
కానీ దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ పనితీరును అంచనా వేయాలి.
మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో జరిగిన అభివృద్ధిని పూర్తిగా విస్మరించలేం.
అదే విధంగా రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, బ్రహ్మోస్ వంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి కదా?
కనుక మోడీని దించాలా? వద్దా? అని కాదు. దించేసిన తర్వాత దేశాన్ని ఎవరు నడిపిస్తారు? అన్నదే ప్రశ్న.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం దేశాన్ని, ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధిని పణంగా పెట్టడం సమంజసమా? అనేది ప్రజలే ఆలోచించాలి.
కాంగ్రెస్ సృష్టిస్తున్న ఈ పద్మవ్యూహంలో దేశ ప్రజలు చిక్కుకుంటే.. ఆ తర్వాత బయటపడేందుకు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
మోడీ, బీజేపీని వ్యతిరేకించే ప్రకాష్ రాజ్, అభిజీత్ దీప్కే వంటి వారిని ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, రాజకీయంగా అస్థిరత సృష్టించడం వల్ల చివరకు నష్టపోయేది రాహుల్ గాంధీ కాదు.. అభిజీత్ దీప్కే కాదు. నష్టపోయేది మన దేశం. మన ప్రజలే.
అందుకే మోడీని దించేద్దాం అనడం చాలా సులభం. కానీ ఆ తర్వాత దేశాన్ని ఎవరు నడిపిస్తారు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు.





