తన తండ్రి జతిన్ దాస్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రముఖ బాలీవుడ్ నటిమణి, దర్శకురాలు అయిన నందితా దాస్ స్పందించారు. ‘మీటూ’ ఉద్యమానికి తాను మద్దతు పలుకుతానని మరోసారి స్పష్టం చేస్తూ… తన తండ్రిపై వచ్చిన ఆరోపణలు తనను కలతకు గురి చేశాయని తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఇప్పటికే ఖండించారని కూడా అన్నారు.
[m9ad]
‘మీటూ’ ఉద్యమానికి తాను బలమైన మద్దతుదారురాలినని, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు అండగా ఉంటానని నందితా దాస్ చెప్పారు. మహిళల ఆవేదనను ప్రతి ఒక్కరూ వినాల్సిన అవసరం ఉందని… అప్పుడే మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పగలుగుతారని తెలిపారు. ఇదే సమయంలో మహిళలు కూడా నిజాయతీగా తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టాలని కోరారు.
స్వలాభం కోసమో, ప్రచారం కోసమో తప్పుడు ఆరోపణలు చేస్తే ఉద్యమం నీరు కారిపోతుందని, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని… తన తండ్రి విషయంలో తాను ఇంతవరకే చెప్పగలనని అన్నారు. నందితా దాస్ తండ్రి జతిన్ దాస్ కు చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒక పేపరు తయారీ సంస్థకు సహయజమానురాలైన ఓ మహిళ 14 ఏళ్ల క్రితం తనను జతిన్ దాస్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై జతిన్ దాస్ స్పందిస్తూ అసభ్యకరం (వల్గర్) అంటూ కొట్టిపారేశారు.



