సినిమాలు.. ఓటీటీలది భార్యభర్తల బంధం

Movies and OTT platforms

సినిమాలు, ఓటీటీలు భార్యభర్తలు వంటివి. ఒకరి తోడు మరొకరికి జీవితాంతం అవసరమే. కానీ కొత్త పెళ్లికూతురులా వినయంగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఓటీటీలు ఇప్పుడు తమనే ఓ ఆట ఆడించేస్తున్నాయని పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆరోపించని రోజు లేదు.

కానీ ముందే చెప్పుకున్నట్లు ఇది భార్యాభర్తల బంధం కనుక డైవోర్స్ అంత సులభం కాదు. ఇష్టమున్నా కష్టమైనా కలిసి కాపురం చేయక తప్పదు.

ADVERTISEMENT

ఓటీటీల వల్లనే థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయిందని ఆరోపిస్తున్నవారు, ఒకవేళ ఓటీటీలు రాకపోయి ఉంటే సినీ పరిశ్రమ పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తారో లేదో?

ఓటీటీలు లేకపోయుంటే, ఒకవేళ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా, ఫ్లాప్ అయినా ఆ నష్టం పూడ్చుకునేందుకు మరో దారి ఉండేది కాదు. కానీ ఓటీటీల పుణ్యమాని ఫ్లాప్ సినిమాలను చివరిగా ఓటీటీలే ఓ చేయి వేసి కాపాడుతున్నాయి.

అలాగే పరిస్థితులు, బడ్జెట్ పరిమితులు కారణంగా థియేటర్లలో విడుదల చేసుకోలేని చిన్న సినిమాలను కూడా ఓటీటీలే ఆదుకుంటున్నాయి.

ఒకప్పుడు సినిమా జీవితం థియేటర్‌లో మొదలై థియేటర్‌లోనే ముగిసిపోయేది. ఇప్పుడు మాత్రం థియేటర్ ఒక అధ్యాయం మాత్రమే. శాటిలైట్, ఓటీటీ, విదేశీ హక్కులు, డిజిటల్ మార్కెట్ అంటూ సినిమా జీవితానికి కొత్త కొత్త అధ్యాయాలు చేరాయి.

ఒకప్పుడు వంద రోజులు ఆడితేనే హిట్ అనేవారు. ఇప్పుడు మొదటి వీకెండ్ కలెక్షన్లు, ఓటీటీ వ్యూస్, సోషల్ మీడియా ట్రెండ్స్ కూడా విజయాన్ని కొలిచే ప్రమాణాలుగా మారిపోయాయి.

అయితే ఈ బంధంలో సమస్యలు లేవా అంటే ఉన్నాయి. ప్రేక్షకుడు ఇంట్లో కూర్చొని కొత్త సినిమాను చూడగలిగే పరిస్థితి వచ్చాక థియేటర్‌కు వెళ్లేందుకు అతడు కొత్త కారణం వెతుకుతున్నాడు.

కేవలం సినిమా అంటే సరిపోదు. మంచి సినిమా అనిపించుకోవడానికి చాలా చాలా కావాలి. ప్రతీ సినిమాలో ప్రేక్షకుడు కోరుకున్నవన్నీ ఉండవు. కనుక ఓటీటీతో పోయే దానికి థియేటర్లకు దేనికి? అని అనుకునేవారు చాలా మందే ఉన్నారు. ఒకవేళ ఓటీటీలు లేకపోయి ఉండి ఉంటే ప్రేక్షకులకు ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు కలిగేవి కావు. తప్పనిసరిగా థియేటర్లకి వచ్చి సినిమా చూసేవాడు.

ఒకప్పుడు ప్రేక్షకుడు సినిమాను వెతుక్కుంటూ వెళ్లేవాడు. ఇప్పుడు సినిమా ప్రేక్షకుడిని వెతుక్కుంటూ ఇంటి వరకూ వస్తోంది. మారింది కేవలం వేదిక మాత్రమే కాదు.. ప్రేక్షకుడి మనస్తత్వం కూడా.

అందుకే సమస్య ఓటీటీలతో కాదు. వాటి రాకతో ప్రేక్షకుడి అంచనాలు, అలవాట్లు, ఎంపికలు మారిపోవడం వలననే అని స్పష్టమవుతోంది.

కాలంతో పాటు ప్రేక్షకుడు మారినప్పుడు సినిమాలు కూడా మారక తప్పదు. ఎందుకంటే సినిమాకి ప్రేక్షకుడే దేవుడు కనుక.

ADVERTISEMENT
Latest Stories