వీడ్కోలు లేని నాయకుడు..!

MS Dhoni IPL Retirement

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో రనౌట్‌తో అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో మరో రనౌట్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ముగించాడు.

ఈ రెండు రన్-అవుట్ ల మధ్యలో ఎన్నో రికార్డులు, మరెన్నో అద్భుత విజయాలు.. భారత క్రికెట్‌కు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడిగా ఎదిగాడు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. కానీ ఇంతటి దిగ్గజానికి మాత్రం తన కెరీర్‌లో ఒక్కసారి కూడా ఘనమైన వీడ్కోలు ఆశించలేదు.

ADVERTISEMENT

2014లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత 2020 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక సోషల్ మీడియా పోస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. మైదానంలో చివరిసారిగా ధోనీని చూడాలని ఎదురుచూసిన అభిమానులకు ఆ అవకాశం దక్కలేదు.

చివరి మ్యాచ్ లేదు.. వీడ్కోలు ప్రసంగం లేదు.. అభిమానుల మధ్య చివరి నడక లేదు. తన జీవితంలోనే కాదు, కోట్లాది మంది అభిమానుల జ్ఞాపకాల్లోనూ ప్రత్యేకంగా నిలిచిపోయే నాయకుడు ఇలా నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌ను మాత్రం ధోనీ వదులుకోలేదు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మొదలైన అతడి ప్రయాణం ఒక జట్టును ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిపింది.

2010, 2011, 2018, 2021, 2023.. ఇలా ఐదుసార్లు సి.ఏ.కె కు టైటిల్స్ అందించాడు. పది ఫైనల్స్‌కు జట్టును నడిపించాడు. చెన్నై అభిమానులకు ధోనీ కేవలం కెప్టెన్ కాదు.. ఆ జట్టుకు చిరునామా, ఆ జట్టు విజయాలకు ప్రతిరూపం. అందుకే అతడిని అభిమానులు ప్రేమగా ‘థలా’ అని పిలుచుకున్నారు.

ఐపీఎల్‌లో ధోనీ వారసత్వం కేవలం ట్రోఫీలతోనే ముగిసిపోదు. 278 మ్యాచ్‌ల్లో 5,439 పరుగులు, వికెట్ల వెనుక 200కు పైగా ఔట్లు.. అతడి సుదీర్ఘ ప్రయాణానికి ఇవి నిదర్శనాలు. చివరి ఓవర్‌లోనూ మ్యాచ్‌ను గెలిపించగలడనే నమ్మకం, హెలికాప్టర్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించడం, వికెట్ల వెనుక మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేయడం.. ఇవన్నీ ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాలుగా మిగిలిపోతాయి.

వయసు పెరిగినా, శారీరక సమస్యలు వేధించినా పసుపు జెర్సీపై ప్రేమతో మైదానంలోకి దిగేందుకు ప్రయత్నించాడు. 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా అభిమానులు మాత్రం అతడి రాక కోసం ఎదురుచూశారు.

ఒకప్పుడు తన చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని ధోనీ చెప్పిన మాట అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. చెపాక్ స్టేడియంలో తన అభిమానుల మధ్య చివరిసారిగా బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావాలని అందరూ ఆశించారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు. 2025 మే 25న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌నే అతడి చివరి ఐపీఎల్ మ్యాచ్‌గా మిగిలిపోయింది.

ఇప్పుడు 2027 సీజన్‌కు ముందు ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు సి.ఎస్.కె అధికారికంగా ప్రకటించింది. అయితే జట్టు నుంచి పూర్తిగా దూరం కాకుండా మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. మైదానంలో అతడి ఆటను ఇక చూడలేమన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోవడం మాత్రం అంత సులభం కాదు.

అంతర్జాతీయ క్రికెట్‌లోనైనా, ఐపీఎల్‌లోనైనా ధోనీకి అభిమానులు కోరుకున్న వీడ్కోలు వేడుక ఎప్పుడూ దక్కలేదు. ప్రతి సందర్భంలోనూ అతడు తన నిర్ణయాన్ని నిశ్శబ్దంగానే ప్రకటించాడు. కానీ ధోనీ లాంటి ఆటగాడికి వీడ్కోలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు.

ఎందుకంటే అతడు కేవలం పరుగులు చేసిన ఆటగాడు కాదు.. ఓటమి అంచున ఉన్నప్పుడు ఆశను నింపిన నాయకుడు, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. మైదానంలో అతడి ప్రస్థానం ముగిసినా, చెపాక్‌లో వినిపించే ‘ధోనీ.. ధోనీ..’ నినాదాలకు మాత్రం ఎప్పటికీ ముగింపు ఉండదు. ‘ధోనీకి క్రికెట్ నుంచి వీడ్కోలు ఉండొచ్చు.. కానీ అభిమానుల హృదయాల్లో అతడికి ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు’!

ADVERTISEMENT
Latest Stories