సోనియా ఆత్మకథ లో ‘తెలంగాణ చాప్టర్’ మిస్సింగ్!

KTR Questions Sonia Gandhi Over Missing Telangana Chapter

వివిధ రంగాల ప్రముఖుల ఆత్మకథలు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో చెప్పలేం కానీ ఆ ప్రముఖుల స్థానంలో రాజకీయ నేతలు ఉంటే మాత్రం వారి ఆత్మకథలు ‘రాజకీయ కథలు’, ‘కథనాలు’గా మారిపోవడం, అవి కాస్త పెను వివాదాలుగా రూపం మార్చుకోవడం సర్వసహజం.

అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ కూడా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో అలాంటి వేడిని రాజేస్తోంది. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తో 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

ADVERTISEMENT

అయితే దేశ రాజకీయాలను, ఒకరకంగా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్ ను పూర్తిగా తారుమారు చేసిన విభజన అంశం, తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన అంతటి చారిత్రాత్మకమైన అంశం, ఒకే ఒక్క ప్రకటనతో 7 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన ఆ అంశం సోనియా ఆత్మకథలో ఎందుకు ప్రచురించలేకపోయారు.?

ఇప్పుడు ఈ ప్రశ్నలే బిఆర్ఎస్ నాయకులకు ఒక రాజకీయ అస్త్రంగా మారింది. ‘తెలంగాణ ఇచ్చింది సోనియమ్మే’ అయితే సోనియా ఆత్మకథలో ‘తెలంగాణ చాప్టర్’ ఎలా మిస్సియ్యంది అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేతల టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.

ఎవరి దయతోను ప్రత్యేక తెలంగాణ రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక తెలంగాణ ప్రజల ఉద్యమస్ఫూర్తి ఉందని, ఎంతోమంది తెలంగాణ యువత బలిదానంతోనే తెలంగాణ సాధ్యమయ్యిందని, నాటి కేసీఆర్ నాయకత్వాన చేపట్టిన తెలంగాణ ఉద్యమాలు కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచాయంటూ కేటీఆర్, సోనియా ఆత్మకథలో తెలంగాణ చాప్టర్ మిస్సింగ్ పై తన ఘాటైన స్పందనను తెలియచేసారు.

మొత్తానికి ‘తెలంగాణ ఇచ్చిన దేవత’గా అంటూ ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతలు చేసే ప్రచారానికి, సోనియా ఆత్మకథలోనే ఆ ప్రస్తావన లేకపోవడంతో ఇది టి.కాంగ్రెస్ నేతలను రాజకీయంగా ఇరకాటంలో పడేసినట్టయ్యిందనే చెప్పాలి. మరి కేటీఆర్ స్పందనకు, ఆయన కాంగ్రెస్ నేతల పై సంధించిన ప్రశ్నలకు టి. కాంగ్రెస్ కౌంటర్ వేస్తుందా? వెయ్యగలదా?

అయితే సోనియా ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావిస్తే కాంగ్రెస్ ఏపీకి చేసిన ద్రోహం, అన్యాయం, పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ చేసిన అరాచకం అన్ని అంశాలు మరోసారి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం, కాంగ్రెస్ మరోసారి రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడం సహజంగా జరిగిపోయేవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే సోనియా తన ఆత్మకథలో ఈ చాప్టర్ ని స్కిప్ కొట్టారా.? అన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న!

ADVERTISEMENT
Latest Stories