ప్రతి సంవత్సరం తన ఆస్తుల విలువను ప్రకటిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్న చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లకు అధిపతి అయ్యారంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం సంచలన ఆరోపణలకు తెరలేపారు. “కేవలం 2 ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించారో ‘కిటుకు’ చెప్తే, తామూ కూడా అదే మార్గాన్ని అనుసరించి కుబేరులమవుతామని, అప్పుడు రిజర్వేషన్ల గురించి ప్రస్తావించమని” చేసిన వ్యాఖ్యలపై టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి.
కాపులను బీసీల్లోకి చేర్చాలని ముద్రగడ చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి లేదని, తన ఆశయాన్ని పక్కన పెట్టి, దానికి సంబంధం లేనటువంటి అంశాలతో ఆరోపణలు చేయడమనేది కేవలం సమస్యను పక్కదారి పట్టించడమేనని, అయినా చంద్రబాబుపై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శమని టిడిపి వర్గాలు సదరు ఆరోపణలను తిప్పికొడుతున్నాయి.
ముద్రగడ చేత ఈ వ్యాఖ్యలు ఎవరు చేయిస్తున్నారో తమకు తెలుసని, అవినీతి ఆరోపణలతో నిత్యం కోర్టుల చుట్టూ తిరిగేవారి పనేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబుపై ఇప్పటివరకు అనేక ఆరోపణలు వచ్చాయి గానీ, ఇలా 2 లక్షల కోట్లకు అధిపతి అని మాత్రం ఎవరూ ఆరోపించలేదు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం లక్ష కోట్ల ఆరోపణలను ఎదుర్కొన్న వైనం తెలిసిందే.





