తెలంగాణా రాష్ట్ర సాధనే లక్ష్యమన్న దృక్పధంతో కేసీఆర్ పనిచేసారు కాబట్టే ఆయన కల సాకారమైంది. ఇందులో కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనం కూడా ఆశించినా, తెలంగాణా సాధన ద్వారా రాజకీయ ప్రయోజనాన్ని పొందారు. ఆ మాత్రం స్పష్టత, నిలకడ ఉంది కాబట్టే ఈ రోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారు. మరి తునిలో “కాపు ఐక్యగర్జన” నిర్వహించిన ముద్రగడ పద్మనాభం బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకుంటే, అసలు ఈయన కాపులకేం చేస్తారన్న భావన కలగడం సహజమే!
తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి వాసి అయిన ముద్రగడ విద్యార్థి దశ నుండే అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి టీడీపీ ఎంపీగా, మంత్రి గానూ పనిచేసిన అనుభవం ఉంది. 1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జనతా పార్టీ తరపున గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ముద్రగడ, ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడంతో ఆ పార్టీలోకి వెళ్లి, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మంత్రి పదవి వరించినా గానీ, పార్టీకి రాజీనామా చేసి ‘ప్రజారక్షణ సమితి’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అలాగే, ఇంతలోనే టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నేతలతో ‘తెలుగునాడు’ పార్టీకి శ్రీకారం చుట్టారు.
1988లో రాజీవ్ గాంధీ ప్రత్తిపాడు రావడంతో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. మళ్ళీ 1994 ఎన్నికల్లో ముద్రగడ ఓటమి చవిచూసిన నేపధ్యంలో 1999లో టీడీపీ వైపుకి వెళ్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 2009 ఎన్నికల్లో మళ్లీ ఆయన కాంగ్రెస్ గూటికి చేరి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రల్లో పాల్గొని వార్తల్లో నిలిచారు. అలా జగన్ కు సన్నిహితంగా మెలుగుతున్న ముద్రగడ పద్మనాభం “కాపు ఐక్య గర్జన” పేరుతో ఆదివారం సభ నిర్వహించి గందరగోళానికి కారణమయ్యారు.
రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణమే అయినప్పటికీ, ముద్రగడ రాజకీయ చరిత్ర ఆయన నిలకడలేమి తనాన్ని బయట పెడుతోంది. ఇలాంటి నాయకుడు ఒక సామజిక వర్గాన్ని ఉద్దరిస్తారని భావిస్తే అంత కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల చిచ్చుతో రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తున్న ఇలాంటి నేతల భరతం పడితేనే రాష్ట్ర పురోగతికి సిఎం చంద్రబాబు మొదటి మెట్టు వేసిన వారవుతారని సామాన్య ప్రజలు భావిస్తున్నారు.





