ముగిసిన ముద్రగడ అంకం! లక్ష్యం నెరవేరిందా?

Mudragada padmanabham withdraws deekshaకాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం దంపతులు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు ‘శుభంకార్డు’ పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్ తదితరులు హాజరై జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో, ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ముద్రగడ పద్మనాభంకు కళా వెంకట్రావ్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేసారు. దీంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యంపై నెలకొన్న ఆందోళన ముగిసింది.

ముద్రగడ చెప్పిన అంశాలను పరిశీలిస్తామని, వచ్చే బడ్జెట్ లో 1500 కోట్లు కాపు కమీషన్ కు కేటాయిస్తామని, అలాగే ఒక వ్యక్తిని కాపు కమీషన్ లో చేర్చే అంశం పరిశీలిస్తామని, తుని వద్ద జరిగిన ఘటనలో సంబంధం లేని వ్యక్తులను కేసులో ఉంచబోమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు ముద్రగడ మాట్లాడుతూ… “గత 20 ఏళ్ళుగా ఈ అంశం వెలుగులో ఉన్నా, గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ వలనే తామూ రోడ్డెక్కామని, ఈ సందర్భంలో జరిగిన సంఘటనలకు క్షమించాలని, సిఎంను గానీ, టిడిపిని గానీ, ప్రభుత్వాన్ని గానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం తమ ఉద్దేశం కాదని” వివరణ ఇచ్చుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఇంతకీ ముద్రగడ చేపట్టిన ఉద్యమ లక్ష్యం నెరవేరిందా? గత నాలుగు రోజులుగా ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష సానుకూల ఫలితాన్ని ఇచ్చిందా? కాపులను బీసీల్లోకి చేర్చే అంశం ఇప్పటికిప్పుడు తేలేది కాకపోవడంతో… ఇది జరుగుతుందా లేదా అన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే గత పది రోజులుగా మీడియా వర్గాల్లో ముద్రగడ పద్మనాభం పేరుపై జరుగుతున్న ప్రచారం రీత్యా ఖచ్చితంగా కావాల్సిన రాజకీయ లబ్ది చేకూరిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గత ఎన్నికల్లో పరాజయం చవిచూసిన ముద్రగడ, తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేసినా, స్థానికంగా ఉన్న కుల బలగం రీత్యా తిరుగులేని విజయం సాధిస్తారనే ప్రచారం స్థానికంగా వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులకు ఎన్నికలలో గెలుపుకు మించిన ప్రధాన అంశం ఏముంటుంది? ఈ రకంగా అయితే ముద్రగడ చేసిన ‘కాపు’ ఉద్యమ లక్ష్యం నెరవేరినట్లే చెప్పవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బీసీల్లో చేర్చే అంశమంటారా… ఆ ఒక్కటీ అడక్కు..!

ADVERTISEMENT
Latest Stories