వివాదాలు లేకుండా పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని ఎన్నిసార్లు పిలిచినా తన అత్త గారి కుటుంబం రాలేదని, పైపెచ్చు ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారని, తనను ఇబ్బంది పెట్టేందుకే తన అత్త, మరిది ప్రయత్నిస్తున్నారని దివంగత సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి ఆరోపణలు చేసారు. కోర్టులో కేసు నడుస్తోందని, మరో 15 రోజుల్లో ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉందని, ఇంతలో ఉన్నత చదువు కోసం తాను యూఎస్ వచ్చిన తరువాత తనను ఇబ్బంది పెట్టడంలో భాగంగా హైదరాబాదులో వారు ఆందోళన చేపట్టారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసారు.
మరో వైపు శ్రావణి తరపు న్యాయవాది గోకుల్ కుమార్ కూడా ఈ కేసుపై స్పందించారు. ఆస్తి కావాలని శ్రావణి కోర్టుకు వెళ్లలేదని, చక్రి కుటుంబ సభ్యులే వెళ్లారని, తనకున్న సమాచారం మేరకు చక్రి తండ్రి హెడ్మాస్టర్ గా రిటైర్ అయ్యారని, ఆయన తదనంతరం చక్రి తల్లికి పెన్షన్ వస్తోందని, ఆమె జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే సమస్యంతా చక్రి సోదరుడితోనేనని, చక్రి నివాసంలో వాటా కావాలని కోరుతున్నాడని, అది చట్టవిరుద్ధమని, ఆ ఇంట్లో చక్రి భార్య, తల్లికి మాత్రమే భాగం ఉంటుందని, ఈ వివాదానికి న్యాయస్థానం పరిష్కారం ఇస్తుందని, అద్దెకున్న వారి దగ్గరకు వెళ్లి ఆందోళన చేయడం, వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం నేరమని ఆయన స్పష్టం చేశారు.



