ఒకప్పుడు పౌరాణిక సినిమా విడుదలవుతుందంటే కుటుంబం మొత్తం థియేటర్‌కు వెళ్ళేది. టీవీల్లో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ ప్రసారమయ్యే సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారేవి.
ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించింది. టీవీల ముందు కదలకుండా కూర్చోబెట్టింది. భారీ సెట్లు కాదు. ఆ కథల్లోని భక్తి, భావోద్వేగాలు, పాత్రల పవిత్రత, వేషధారణ, సంగీతం, పాటలు భారతీయ ప్రేక్షకుల ఆధ్యాత్మిక భావనలను సంతృప్తిపరిచేవి. అదే వాటి విజయ రహస్యం.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ, వీఎఫ్‌ఎక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కనుక పౌరాణిక సినిమాలు భారీతనం సంతరించుకున్నాయి. భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ వగైరా హాలీవుడ్ మూవీలతో పోటీ పడే స్థాయిలో వున్నాయి.
కానీ పౌరాణిక సినిమాలలో ఈ మార్పు ఆ కథల ఆత్మను క్రమంగా మాయం చేస్తోంది. దర్శకులు కథను సహజంగా చెప్పడం కంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, చివరికి రావణాసురుడు వంటి పాత్రలలో హీరోయిజాన్ని హైలైట్ చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
సాధారణ కమర్షియల్ లేదా యాక్షన్ సినిమాలలో హీరోని ఎలివేట్ చేస్తే చప్పట్లు పడతాయి. కలెక్షన్స్ పెరుగుతాయి. కానీ పౌరాణిక సినిమాలలో ఒక స్థాయికి మించి ఎలివేషన్స్, దాని కోసం ప్రత్యేకంగా సన్నివేశాలు సృష్టించడం వల్ల ప్రేక్షకులకు భక్తి భావన కంటే ఫాంటసీ సినిమా చూస్తున్న అనుభూతి ఎక్కువగా కలుగుతోంది. దీంతో కుర్చీలో కదలకుండా కూర్చొని సినిమా చూడాల్సిన ప్రేక్షకులు సినిమాతో ‘డిస్‌కనెక్ట్’ అవుతుంటారు.
భారీ సెట్లు, అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రేక్షకులను కొంతసేపు ఆశ్చర్యపరచవచ్చు. కానీ భారతీయ ప్రేక్షకులు పౌరాణిక చిత్రాల నుంచి కోరుకునేది కేవలం విజువల్ స్పెక్టకిల్ కాదు.
ఆ పాత్రలపై గౌరవం, ఆ కథలపై విశ్వాసం, చూసిన తర్వాత కలిగే ఆధ్యాత్మిక అనుభూతి. అవే లేకపోతే ఎంత భారీ నిర్మాణమైనా ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్న ఉదాహరణలు ఇటీవలి కాలంలో కనిపిస్తున్నాయి.
పాత పౌరాణిక సినిమాలు, వాటిలో పాత్రలు, వాటి వేషధారణ, ముఖ్యంగా పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నాయి. కానీ నేడు వందల కోట్లతో గొప్పగా తెరకెక్కిస్తున్న సినిమాలు బాగుంటే ఓటీటీలోకి వచ్చే వరకే వాటి షెల్ఫ్ లైఫ్. ఆ తర్వాత వాటిని ఎవరూ గుర్తు చేసుకోరు కూడా. ఎందువల్ల? అంటే ముందే చెప్పుకున్నాము.
కనుక పౌరాణిక సినిమాలు కేవలం సాంకేతిక ప్రదర్శనగా కాకుండా, వాటి మూల ఆత్మను కాపాడే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత దర్శకులు, నిర్మాతలపైనే వుంది.




