సహజంగా ఒక సినిమా కాంబినేషన్ ను నిర్మాతలు ప్రకటిస్తారు. ఆ తరువాత కొన్ని రోజుల షూటింగ్ అనంతరం ప్రసార హక్కులు అమ్ముడు అయిపోతాయి… చిన్న సినిమాలకు విడుదల తరువాత కూడా అమ్ముడు పోతాయి. బాగా క్రేజీ సినిమాలు అయితే షూటింగ్ మొదలు కాకముందే ప్రసార హక్కులు అమ్ముడు అయిపోతాయి. కానీ ఒక సినిమాను అధికారికంగా ఒక టీవీ ఛానల్ మేము ప్రసార హక్కులు కొన్నాం.. ఈ చిత్రం జరగబోతుంది అని ప్రకటించడం ఎప్పుడైనా చూశారా? సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది.
జెమినీ టీవీ తన ట్విట్టర్ హేండిల్ లో కాసేపటి క్రితం నాగచైతన్య, రష్మిక మందన్నా కాంబినేషన్ లో వస్తున్న అదే నువ్వు అదే నేను అనే చిత్రం సాటిలైట్ రైట్స్ కొన్నాం అని ప్రకటించింది. దర్శకుడి పేరు కూడా లేదు. అయితే నాగచైతన్య, రష్మిక మందన్నా కాంబినేషన్ లో కొత్త సినిమా ఏదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఈ మధ్యనే నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల సినిమా ఒకటి ప్రకటించారు. కొంపతీసి జెమినీ టీవీ హీరోయిన్ విషయంలో పొరపాటు పడిందా అనే అనుమానాలు ఉన్నాయి.
లేకపోతే ఏదైనా కొత్త చిత్రం అధికారిక ప్రకటన జెమినీ టీవీనే చేసిందా అనేది తెలియాల్సి ఉంది. రెండోది నిజమైతే గనుక టాలీవుడ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టే. నాగచైతన్య ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే కమ్ముల సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలు పెట్టాడు. మరోవైపు రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఆమె ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా ఒక స్టార్ హీరో తో పని చేస్తుంది.





