ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో స్థిరపడడానికి తాపత్రయపడుతున్న యువహీరో నాగశౌర్య నటించిన “కళ్యాణ వైభోగమే” సినిమా ఆడియో జనవరి మొదటి వారంలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి ఆడియో వేడుక జరుపుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా వాయిదాల పర్వం కొనసాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం “కళ్యాణ వైభోగమే” ధియేటర్లలో సందడి చేయడానికి ముహూర్తం కుదిరింది.
‘శివరాత్రి’ కానుకగా తన కళ్యాణాన్ని ప్రదర్శించడానికి ముహర్తం సిద్ధం చేసుకున్నారు నాగశౌర్య. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రాబట్టడమే లక్ష్యంగా శివరాత్రి కానుకగా అన్ని హంగులు పూర్తి చేసుకుని మార్చి 4వ తేదీన ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం తన “కళ్యాణ వైభోగం” తీసుకురాబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ అధికారికంగా డిక్లేర్ చేసి, పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది.
‘అలా మొదలైంది’ ఫేం నందినిరెడ్డి దర్సకత్వం వహించిన ఈ సినిమాను దామోదర్ రెడ్డి నిర్మించారు. “ఉహాలు గుసగుసలాడే” సినిమాతో నాగశౌర్యకు ‘మ్యూజికల్ హిట్’ అందించిన కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలను అలరిస్తోంది. ఇక, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో తెలుగుతెరపై ప్రవేశించిన మాళవిక నాయర్ ఈ సినిమాకు ఆదనపు ఆకర్షణ. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య “కళ్యాణ వైభోగం” అద్భుతంగా జరగాలంటే… ప్రేక్షకుల ఆహ్వాన పత్రికల పబ్లిసిటీ బాగా చేయాలి మరి!



