మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో బిజీగా ఉన్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. అయితే ఆయన మొన్న ఈ మధ్య ఉన్నఫళంగా కుటుంబసమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి వచ్చారు. ఆ తరువాత అడగకుండానే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు మద్దతు ఇచ్చారు.
దీనితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. “చాలా వెబ్ సైట్స్ దీని గురించి రాస్తున్నాయి. దీనితో అభిమానులకు చాలా అయోమయం ఉంది. కొంత మంది కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని నేను అనుకుంటున్నా,” అని చెప్పుకొచ్చారు.
“తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి మా అన్నయ్య చిరంజీవి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా నిబద్దత చూసి, ఒకే కుటుంబంలో ఇద్దరు రాజకీయాలలో విడివిడిగా ప్రయాణం చెయ్యడం మంచిది కాదు అనుకున్నారు. ఆయన రాజకీయాలలోకి రావాలని అనుకుంటే ఆయనకు చాలా పదవులు వస్తాయి,” అన్నారు.
“రాజకీయాలలో చిరంజీవి చూడని ఎత్తులు లేవు. కేంద్ర మంత్రిగా పని చెయ్యడం అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చేసినట్టే. అంశాల వారీగా కుటుంబాల మధ్య కొంత బేధాభిప్రాయాలు ఉండొచ్చు. దానికి ఆయన ఇంటి ముందు ధర్నాలు చెయ్యడం, కొంత మంది ప్రొడ్యూసర్లు (అశ్విని దత్) అతిగా వాగడం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి,” అని హెచ్చరించారు.



