అనపర్తిలో నల్లమిల్లి మద్దతు లేకుండా బీజేపీ గెలవకపోతే?

Nallamilli Ramakrishna Reddy

టిడిపి మొదటి జాబితాలోనే తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి సీటుని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేసింది. కానీ పొత్తులలో భాగంగా ఆ సీటుని బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఆయన, కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలతో మండి పడుతున్నారు.

ADVERTISEMENT

రామకృష్ణా రెడ్డి స్వయంగా ట్విట్టర్‌లో తన మనోవేదనని, గత 40 ఏళ్ళుగా పార్టీకి చేసిన సేవలను, గత 5 ఏళ్ళుగా భరిస్తున్న వైసీపి ఒత్తిళ్ళు, అరాచకాలను ప్రస్తావిస్తూ, టిడిపి అధిష్టానం తనను అభ్యర్ధిగా ప్రకటించి మళ్ళీ తన సీటుని బీజేపీకి కేటాయించడాన్ని తప్పు పట్టారు. టిడిపి అధిష్టానం ఈవిదంగా అన్యాయం చేయడాన్ని భరించలేకపోతున్నానని రామకృష్ణా రెడ్డి ట్విట్టర్‌లో వరుసగా సందేశాలు పెడుతున్నారు.

గురువారం ఉదయం అనపర్తిలో తన నివాసం వద్ద అనుచరులతో సమావేశమైనప్పుడు, అందరూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన అనుచరులలో ఒకరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం కూడా చేయబోతే అందరూ కలిసి అడ్డుకున్నారు.

చంద్రబాబు నాయుడు స్వయంగా రామకృష్ణా రెడ్డికి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ తనను కాదని బీజేపీ అభ్యర్ధి ఎం.శివకృష్ణంరాజుకి ఈ సీటు కేటాయిస్తే సర్దుకుపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. తన అనుచరులతో చర్చించి రెండు మూడు రోజులలో తన భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

అంటే వైసీపిలో చేరిపోవడం లేదా రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేయడం అనుకోవచ్చు. రామకృష్ణా రెడ్డికి తీరని అన్యాయం జరిగిందంటూ అప్పుడే వైసీపి నేతలు మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు. వైసీపిలోకి వస్తే టికెట్‌ ఇవ్వకపోయినా తప్పకుండా ఓదార్చుతామని, కలిసి బీజేపీ అభ్యర్ధి ఎం.శివకృష్ణంరాజుని ఓడిద్దామని సంకేతాలు పంపిస్తున్నారు. ఆయన వైసీపిలో చేరినా చేరకపోయిన చివరికి జరిగేది మాత్రం ఇదే.

ఆయన రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేస్తే ఎలాగూ ఎం.శివకృష్ణంరాజుని ఓడించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ పోటీ చేయకపోయినా, ఆయన తరపు నుంచి ఎం.శివకృష్ణంరాజుకి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. పైగా వైసీపితో చేతులు కలిపి దెబ్బ తీయడం కూడా ఖాయమే.

ఏతావాతా తేలేది ఏమిటంటే, టిడిపికి దక్కాల్సిన అనపర్తి సీటుని బంగారు పళ్ళెంలో పెట్టి వైసీపికి అందించేస్తున్నారన్న మాట! కనుక బీజేపీ కోసం బలమైన అనపర్తిని, పార్టీకి నమ్మకమైన నాయకుడుగా పేరున్న రామకృష్ణా రెడ్డిని కోల్పోవడం అవసరమా?ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ రెడ్డిని చేజెతులా వైసీపిలో సాగనంపడం మంచిదేనా? టిడిపి అధిష్టానం ఆలోచించుకుంటే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories