పాపం కిరణ్‌ కుమార్‌ రెడ్డి! ఎవరికీ అక్కర్లేదా?

Kiran-Kumar-Reddy-AP-BJPసమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించినందుకు, తెలంగాణ నేతలను కించపరిచినందుకు ఆయనకు అక్కడ చోటే లేదు.

ఆయన బిజెపిలోకి మారినందున ఏపీ బిజెపి పగ్గాలు ఆయనకు అప్పగించబోతోందనుకొంటే, దగ్గుబాటి పురందేశ్వరిని ఆ పదవిలో నియమించడంతో ఏపీలో కూడా ఆయన అవసరం లేకుండాపోయింది. అంటే రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి మంచి అవగాహన ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలలో ఆయనకు చోటు లేకుండా పోయింది. బహుశః అందుకే ఆయనకు బిజెపి జాతీయకార్యదర్శి పదవి ఇచ్చి రిజర్వులో ఉంచుకొన్నట్లుంది.

ADVERTISEMENT

మొన్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపడుతున్నప్పుడు, అధిష్టానం తరపున ఆయన కార్యక్రమానికి హాజరైనప్పుడు చేదు అనుభవం ఎదురైంది. పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు విజయశాంతి కార్యక్రమంలో మద్యలోనే బయటకు వెళ్ళిపోయారు. దానిపై ఆమె సోషల్ మీడియాలో ఇచ్చిన వివరణ తెలంగాణ బిజెపిలో మరో బాంబు పేల్చింది.

ఇంతకీ ఆమె ఏమన్నారంటే, “బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డిగారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది సరి కాదు. కిషన్ రెడ్డిగారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను. ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించినవారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది.. జై శ్రీరామ్ హర హర మహాదేవ జై తెలంగాణ, “ అని ట్వీట్‌ చేశారు .

ఆమె కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దేశ్యించే ఈమాట అన్నారని అర్దమవుతూనే ఉంది. అయితే తెలంగాణలో ఆమె ఒక్కరే కాదు… ఆ రాష్ట్ర ప్రజలు, బిజెపితో సహా అన్ని పార్టీలలో నేతలు, కార్యకర్తలు కూడా కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ‘తెలంగాణ ద్రోహి’గా పరిగణిస్తున్నారు. కనుక తెలంగాణలో ఆయనకు చోటు లేదు.

అలాగని ఏపీలో ఆయనకు స్వాగతం పలికేవారెవరు కూడా లేరు. దగ్గుబాటి పురందేశ్వరి చిరకాలం వేచి చూచిన తర్వాత ఆమెకు ఈ పదవి, బాధ్యతలు లభించాయి. కనుక ఆమె తన సమర్ధతను నిరూపించుకోవాలని తప్పక ప్రయత్నిస్తారు. కనుక కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఆమె స్వాగతిస్తారనుకోలేము.

ఒకవేళ ఆమె ఆయన సేవలు ఉపయోగించుకోవాలనుకొన్నా, ఇతర పార్టీల నేతలతో ఆయనకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఎవరినైనా పార్టీలోకి తెచ్చుకొనేందుకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అదే… ఆయన కాంగ్రెస్ గూటికే చేరి ఉండి ఉంటే కాంగ్రెస్‌ అధిష్టానం సంతోషంగా ఆయనకు ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించి ఉండేది. కానీ బిజెపిలో చేరడం పొరపాటుగానే కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories