నందమూరి నటసింహం డైలాగ్ డెలివరీ విషయం తెలియనిది కాదు. రంగారావు, ఎన్టీఆర్ ల తర్వాత ఆ రేంజ్ లో పౌరాణిక పదాలను అద్భుతంగా పలికించగల ఏకైక హీరో బాలకృష్ణ మాత్రమే. అలాంటి బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను అమెరికాలో కాలిఫోర్నియాలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం ఓ పౌరాణిక డైలాగ్ ను అనర్గళంగా పలికి ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రసగించిన బాలయ్య… ‘ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది… తెలుగు పేరు వినిపించినా నా తనువు పులకించిపోతుంది… ప్రతికూల పరిస్థితులకి తలవంచక ముందుకు సాగిన నేత ఎన్టీఆర్’ అంటూ ఉద్వేగంగా ప్రసగించారు. ఆయనకు కుమారుడిగా జన్మించడం తన అదృష్టమని అన్న బాలయ్య.., తన తండ్రి కోట్లాది అభిమానులని వారసత్వంగా ఇచ్చి వెళ్లారని వ్యాఖ్యానించారు. తెలుగు జాతి గౌరవం నిలబెట్టిన మహానేత సీఎంగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఎన్టీఆర్ సేవల్ని గుర్తుచేసుకున్నారు.





