హాలీవుడ్ లో సీక్వెల్ కల్చర్ విపరీతం. ఒక కాన్సెప్ట్ హిట్టయ్యిందంటే దాని మీద జస్ట్ నెంబర్లు మార్చుకుంటూ సినిమాలు తీస్తూనే పోతారు. ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్, కింగ్ కాంగ్, స్పైడర్ మ్యాన్, అవతార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంఖ్య వందల్లో ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం వీటి కౌంట్ తక్కువే. ధూమ్ బ్లాక్ బస్టర్ అయితే 2ని అంతకన్నా గ్రాండ్ గా తీశారు. బాగానే ఆడింది కానీ ఒరిజినల్ అంత పేరు రాలేదు. సరే అని అమీర్ ఖాన్ తో 3 తీశారు. కొంచెం తేడా కొట్టింది. అంతే అక్కడితో ఆపేశారు. హేరా ఫేరీ, క్రిష్, గోల్ మాల్, హౌస్ ఫుల్, వెల్కమ్ బాలీవుడ్ లోనూ గత కొన్నేళ్లలో ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాహుబలి 2 తర్వాత ఇప్పుడిది సౌత్ లోనూ పెరుగుతోంది
ఒకప్పుడు వర్మ తక్కువ బడ్జెట్ తో తీసిన మనీ ఘనవిజయం సాధించాక అదే దర్శకుడు శివనాగేశ్వరరావుతో మనీ మనీ తీస్తే యావరేజ్ అయ్యింది. చాలా గ్యాప్ తీసుకుని మూడో భాగం తీయిస్తే అడ్రెస్ లేకుండా పోయింది. కేవలం బాహుబలి, కెజిఎఫ్ లాంటివి మాత్రమే ఈ నెగటివ్ సెంటిమెంట్ ని తట్టుకుని నిలబడ్డాయి. తాజాగా హిట్ 2 హిట్టు కొట్టింది. అందులో డౌట్ లేదు. కేవలం నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అది కూడా పదిహేను కోట్లను టార్గెట్ గా పెట్టుకుని అంటే చిన్న విషయం కాదు. ఆ ఉత్సాహంతో దర్శకుడు శైలేష్ కొలను ఇంతకు మించిన ర్యాంపేజ్ ని హిట్ 3లో నాని పోషించబోయే అర్జున్ సర్కార్ పాత్రతో చూపిస్తానని పెద్ద హామీ ఇచ్చేసాడు.
నిజానికి హిట్ 2 సక్సెస్ ని ఎవరూ కాదనలేరు కానీ మరీ కనివిని ఎరుగని గొప్ప థ్రిల్లర్ ఏం కాదనేది వాస్తవం. రెండు మూడు ట్విస్టులను హ్యాండిల్ చేసిన తీరు, టేకింగ్ లో నిజాయితీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయి వసూళ్లు ఇచ్చేశారు. అసలే పోటీ లేని రిలీజ్ టైమింగ్ కూడా కలిసి వచ్చింది. మేజర్ తర్వాత అడవి శేష్ ఇమేజ్ ఎంతగా పెరిగిందో హిట్ 2 మార్నింగ్ షోకు వచ్చిన ఓపెనింగ్స్ తేటతెల్లం చేశాయి. దానికి కారణం నిర్మాత నాని బ్రాండో శైలేష్ మీదున్న విపరీతమైన నమ్మకమో కాదు. ఆ మాటకొస్తే హిట్ 1 సైతం హిట్ మూవీ ఎం కాదు థియేటర్స్ లో. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు మెచ్చుకున్నారు. విశ్వక్ సేన్ క్యారెక్టర్ ని మోసిన తీరు ప్లస్ అయ్యింది.
ఇప్పుడు హిట్ 3కి శైలేష్ ర్యాంపేజ్ అనే పదం వాడేశారు. ప్రొడ్యూసర్ గా నాని ఎంత సక్సెస్ అయినా హీరోగా గత కొంత కాలంగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. వి లాంటి సీరియస్ మూవీలో కిల్లర్ పాత్రను పబ్లిక్ ఒప్పుకోలేదు. దీంతో పాటు ఓటిటిలో వచ్చిన టక్ జగదీశ్ తిరస్కారానికి గురయ్యింది. ఫ్యామిలీ స్టాంప్ ఉన్నా అంటే సుందరానికి గట్టెక్కలేకపోయింది. శ్యామ్ సింగ రాయ్ హిట్టే కానీ దాన్నుంచి ఆశించింది చాలా ఎక్కువ. ఇక మార్చిలో రాబోయే దసరానే బ్రేక్ ఇవ్వాలి. అలాంటి పరిస్థితిలో హిట్ 3లో ఏదో మహేష్ బాబునో రామ్ చరణ్ నో డీల్ చేస్తున్నట్టు నెక్స్ట్ లెవెల్ చూపిస్తానని దర్శకుడు చెప్పడం లేనిపోనీ అంచనాలు పెంచుతుంది.దాన్ని నాని మోయడం సులభంగా ఉండదు. ఈసారి కూడా మళ్ళీ అమ్మాయిల హత్యలు సైకో వెతుకులాటే పెడతారా లేక డిఫరెంట్ గా చూపిస్తారా అనేదాని మీద అర్జున్ సర్కార్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది.



