పెద్ద సినిమాలు విడుదలై రెండు, మూడు వారాలు గడిచిన తర్వాత మళ్ళీ అభిమానులను, ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించడానికి నిర్మాతలు పలు రకాల ఎత్తుగడలు వేస్తుంటారు. అదనపు సన్నివేశాలను’ జోడించడం ఈ ప్లాన్ లో ముఖ్యమైనది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాకు కూడా ఈ ఫీట్ నే రిపీట్ చేయబోతున్నారు. అయితే కొత్త సీన్ల విషయంలో “శ్రీమంతుడు” తరహాలోనే ఫాలో అయిపోతుందట.
సినిమా విడుదలైన నాలుగు వారాలకు “శ్రీమంతుడు” సినిమాలో రెండు అదనపు సన్నివేశాలను జోడించారు. దీంతో ఆ సన్నివేశాలలో మహేష్ ఎలా ఉంటారోనని ఆతృతగా సినిమాకు వెళ్ళిన అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఎందుకంటే, కొత్త సీన్లలో రెండింటిలోనూ ప్రిన్స్ కనపడలేదు. రాజేంద్రప్రసాద్ నటించిన ఓ రెండు సీన్లను చిత్రయూనిట్ జోడించి ప్రిన్స్ అభిమానులను నిరాశపరిచారు.
ఇపుడు ఇదే ఫార్ములాను “నాన్నకు ప్రేమతో” యూనిట్ కూడా చేయబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సన్నివేశం కాకుండా జగపతిబాబు పోషించిన పాత్రకు సంబంధించిన ఓ కీలక సీన్ ను సినిమాలో కలపబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ తెలిపారు. ఎప్పటి నుండి ఈ సీన్ ధియేటర్లలో ప్రత్యక్షమవనుందో సమాచారం లేదు గానీ, ఈ కొత్త సీన్ లో జూనియర్ మాత్రం ఉండబోవడం లేదు. ఈ విషయం తెలుసుకున్న ‘బుడ్డోడు’ అభిమానులు కాస్త నిరాశ చెందగా, మరి కొత్త సీన్ సినిమాకు ఏ మేరకు దోహదపడుతుందో చూడాలి.





