గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం వారసులతో హోరెత్తుతోంది. టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్, టీడీపీ తరపున లోకేష్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ‘అభివృద్ధి’ అనే నినాదంతో అడుగులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘కారు ధనికులది… సైకిల్ కామన్‌మేన్’ది అంటూ టీడీపీ కార్యదర్శి లోకేష్ టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ వాగ్భాణాలు సంధిస్తున్నారు. టీడీపీ- బీజేపీలు జోడెద్దులయితే… హైదరాబాద్ బండి అని తమ కూటమికి పట్టం కడితే నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు లోకేష్.
విభజన తర్వాత 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తెలంగాణకు వుంటే… ఏపీకి 16 వేల కోట్ల లోటు బడ్జెట్ వుందని, అయినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నదులను అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్‌ని కరవు రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. గడిచిన రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో పార్కులు, భవనాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ, బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని, మీ ప్రాంతంలో గడిచిన రెండేళ్లలో ఒక్క రోడ్డైనా వెలసిందా? తాగు నీటికి పరిష్కారం లభించిందా? అంటూ ఓటర్లను ప్రశ్నించారు లోకేష్.
తమ కూటమిని గెలిపిస్తే… 6 నెలల్లోగా తాగునీటి సమస్యను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ర్టాలకు పార్టీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేష్ పూర్తిస్థాయిలో గ్రేటర్ ఎన్నికలకు ప్రచార బాధ్యత వహించి ముమ్మరంగా హైదరాబాద్‌లోని ఆయా వార్డులను సందర్శించి ప్రజలతో మమేకం కావడం గమనార్హం. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ-బీజేపీ కూటమి ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఓడించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.





