ఒక్కోసారి సదస్సులలో కొందరు రాజకీయ నాయకులు అద్భుతంగా మాట్లాడి ప్రశంశలు అందుకుంటారు. మరికొందరు అద్భుతంగా జవాబులు చెప్తున్నామనుకొని అడ్డంగా దొరికిపోతుంటారు. కేరళలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్-2026లో ఇదే జరిగింది.
ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రి నారా లోకేష్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వీరిద్దరిలో కేటీఆర్‌కు సహజంగానే మంచి వాక్చాతుర్యం ఉందనే సంగతి తెలిసిందే. కానీ అయన షారూక్ ఖాన్ అంటూ చెప్పిన జవాబుతో నవ్వుల పాలవుతున్నారు.
టీఆర్ఎస్ పేరు మార్పు గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, “నేను షారూక్ ఖాన్ అని పేరు మార్చుకుంటే షారూక్ ఖాన్ అయిపోను కదా? అలాగే మా పార్టీ పేరు మార్చుకున్నా మా ఆలోచనలు, సిద్ధాంతాలు, విధానాలు, నాయకత్వం ఏదీ మారలేదు.
తెలంగాణలో మేము ప్రవేశపెట్టిన పధకాలు, చేసిన అభివృద్ధి పనులను దేశ ప్రజలందరికీ అందించాలనే మేము ఆ ప్రయత్నం చేశాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. అయినా తెలుగు నేలపై తీసిన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగినప్పుడు మా పార్టీ ఎందుకు జాతీయ స్థాయికి ఎదగకూడదు?” అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు.
షారూక్‌తో పోల్చుకొని అయన చెప్పిన సమాధానం క్యాచీగానే ఉంది. కానీ పేరు మార్చుకున్నా తమ ప్రాంతీయవాదపు ఆలోచనలు మారలేదని, నేటికీ అవి అలాగే ఉన్నాయని కేటీఆర్ చెప్పుకున్నట్లయింది. అలాగే పాన్ ఇండియా సినిమాలు తీయడం, జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయడం రెండూ ఒకటేనన్నట్లు కేటీఆర్ మాట్లాడటం విచిత్రంగానే ఉంది.
ఇక మంత్రి నారా లోకేష్ ఒకప్పుడు బహిరంగంగా మాట్లాడేందుకు తడబడేవారు. కనుక ఆయనతో వైసీపీ బాగానే ఆడుకుంది కూడా. అలాంటి పరిస్థితి నుంచి నారా లోకేష్ సాన పట్టిన కత్తిలా మారగలిగారు.
ఈ సదస్సులో ఆయన చాలా క్లిష్టమైన ప్రశ్న ఎదుర్కొన్నారు. “ఇదివరకు మీ తండ్రిగారు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమీషన్, బిజేపి కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వారిని సమర్ధిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?” అని సూటి ప్రశ్నకు ఎవరైనా తడబడి ఏదో మాట్లాడేస్తారు.
కానీ నారా లోకేష్ మాత్రం చాలా కూల్‌గా “నాడు, నేడు తప్పులు జరిగిన ప్రతీసారి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము. సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా నష్టపోకూడదని మా అభిప్రాయం. ఇదే విషయం మేము నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పలుమార్లు చెప్పాము.
అయినా ఓ రాజకీయ నాయకుడుగా ఓటర్లను కోల్పోతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాము? కనుక పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేము సూచిస్తూనే ఉన్నాము. కానీ సర్ ప్రక్రియ పేరుతో మన రాజ్యాంగ వ్యవస్థని నిందించడం సరికాదని భావిస్తున్నాను,” అని మంత్రి నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఇది రాజకీయంగా చాలా బ్యాలన్స్‌డ్ సమాధానమని అర్ధమవుతూనే ఉంది. ఇది అయన రాజకీయ పరిణతికి చక్కటి నిదర్శనం కూడా.
ముఖ్యంగా అంతమంది జాతీయ మీడియా ప్రతినిధులు ఎదురుగా కూర్చోవడమే పెద్ద సవాల్. వారి ముందు కూర్చొని వారి ప్రశ్నలకు ఏమాత్రం తడబడకుండా సమాధానాలు చెప్పడం ఇంకా గొప్ప విషయం. ముఖ్యంగా నవ్వులు పాలవకుండా సమాధానాలు చెప్పడం ఇంకా కష్టం.
కానీ నారా లోకేష్ అలవోకగా సమాధానాలు చెప్పగా, మంచి వాక్చాతుర్యం కలిగిన కేటీఆర్ షారూక్ ఖాన్ ప్రస్తావన తెచ్చి నవ్వుల పాలయ్యారు.





