ఇదివరకు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలతో నోట్ల రెపరెపలు, వైసీపీ రంగులతో కళకళలాడే భవనాలు, ఎక్కడ చూసినా జగన్ బొమ్మలు, ఫ్లెక్సీ బ్యానర్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కళకళలాడిపోయేది.
నాటి రెపరెపలు, కళకళలు, ఫ్లెక్సీలు ఇప్పుడు లేవు. కానీ హైదరాబాద్ చరిత్రకు చార్మినార్, గోల్కొండ సాక్షులు కాగా, వైసీపీ పాలనకు రుషికొండ ప్యాలస్ సాక్షిగా అలాగే చెక్కు చెదరకుండా నిలిచి ఉంది.
అయితే జగన్‌కున్న దూరదృష్టికి, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకున్న దూరదృష్టికి చాలా తేడా ఉంది. ఈ తేడా ఏమిటో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ ఆ చర్చ అనవసరం.
కానీ ఈ తండ్రీకొడుకులు నోరు విప్పి మాట్లాడితే జగన్‌లా షిక్కటి షిర్నవ్వులు షిందిస్తూ చక్కగా మాట్లాడలేరు. నోరువిప్పితే చాలు అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు అంటే ఒకటే గోల.
ఇక ఈ పెద్దాయన ఎవరికీ అర్థంకాని భాషలో క్వాంటం, బ్లాక్ చెయిన్, సెమీ కండక్టర్, ఏరో స్పేస్ అంటూ ఏవేవో మాట్లాడుతుంటారు. చివరికి అమరావతిలో ఎత్తైన బిల్డింగులకి కూడా టెక్నాలజీ వాడేస్తూ ఉంటారు.
ఆయన ఆలోచనలు 30-40 ఏళ్ళ తర్వాత రాష్ట్ర అవసరాలు, పెరిగే జనాభా, అప్పటి పరిస్థితుల గురించి, ఆయన చూపులు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాయి.
ఈ వయసులో కృష్ణారామా అనుకుంటూ ఇంట్లో కూర్చొని నాలాంటి యువకులకు అవకాశం ఇవ్వకుండా, ఈ అర్థం కాని ఆలోచనలేమిటో…అని జగన్ అప్పుడప్పుడు ఆయన గురించి దిగులు పడుతూనే ఉంటారు.
ఇక ఆ పిల్లాడు లోకేష్‌కి మరీ దూకుడు ఎక్కువ. అయితే ట్రంప్‌కి కూడా ఉంది దూకుడు. ఆయన దూకుడు యావత్ ప్రపంచానికి ప్రమాదకరం. కానీ ఈ పిల్లాడి దూకుడు వేరే! ప్రపంచంలో ‘పెట్టుబడులన్నీ మా రాష్ట్రానికే వచ్చేయాలని. పరిశ్రమలు, ఐటి కంపెనీలు అన్నీ మాకే వచ్చేయాలని’ తెగ ఆరాట పడిపోతుంటాడు.
ఎంతగా అంటే, ఎవరైనా ఎక్కడైనా పెట్టబడి,పరిశ్రమ పెడదామని రాత్రి కలలో అనుకుకుంటే పొద్దునే ఫోన్ చేసి మాట్లాడేసే అంత!
తన దూకుడు గురించి సోషల్ మీడియాలో పెడితే, అవతలివైపు నుంచి సరిగ్గా ఇలాంటివాడే శివకుమార్ నాగరాజ్ అనే ఒకాయన తగిలాడు.
ఆయన ఏమన్నాడంటే, “నమస్తే లోకేష్! మేము పాలసముద్రంలో పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాము. అక్కడున్న భారత్ ఎలాక్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి మేమే విడిభాగాలు సరఫరా చేస్తుంటాము. ప్రస్తుతం బెంగలూరులోని ఏరో స్పేస్ పార్కులో మా ఎన్‌టెక్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఉంది. కనుక పాలసముద్రంలో మాకు భూమి కేటాయించగలరేమో దయచేసి తెలియజేయండి,” అంటూ మెసేజ్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలంలో పాలసముద్రం ఉంది. అక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్) ఉంది.
బహుశః ఈపాటికి నారా లోకేష్ ఫోన్ చేసి మాట్లాడే ఉంటారు. ఎందుకంటే, ముందే చెప్పుకున్నాం కదా.. ఈ పిల్లాడికి కాస్త దూకుడు ఎక్కువని!
Thank you for your enquiry Shiva. I looked up your company – exciting to see what you’re working on in defence and aerospace. I’ll coordinate this right away. @AP_EDB please get in touch.
#ChooseSpeedChooseAP— Lokesh Nara (@naralokesh) November 20, 2026





