టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నేడు 186వ రోజు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి సాయంత్రం 6 గంటల వరకు యెర్రబాలెంలో ‘హలో లోకేష్’ పేరుతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే ఎటువంటి మార్పులు తీసుకువస్తుందో నారా లోకేష్ ఈ కార్యక్రమంలో వివరిస్తారు. అలాగే వివిద అంశాలు, సమస్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారు. దూరప్రాంతాలలో ఉన్నవారు కూడా 09686 296862 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేసిన నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. కనుక మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మరింత ప్రత్యేకత ఉంటుంది.
నారా లోకేష్ నిన్న మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు మహిళలు ఎదురేగి హారతులిచ్చి ఆప్యాయంగా స్వాగతం పలికారు. నిన్న యువగళం పాదయాత్రలో ఇసుకవేస్తే కింద రాలనంతగా జనాలు తరలివచ్చారు.
నారా లోకేష్ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రవేశించి జిల్లాలో మూడు రోజులు యువగళం పాదయాత్ర చేయనున్నారు. టిడిపి సీనియర్ నేత కేశినేని శివనాధ్ (చిన్ని) నారా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ విడుదల చేశారు.
ఆగస్ట్ 19న విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, ఆగస్ట్ 20న విజయావాడ తూర్పు, పెనమలూరు, ఆగస్ట్ 21న గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేశినేని శివనాధ్ చెప్పారు.



