యాత్ర 2 కి విరుగుడుగా ప్రతినిధి 2?

Prathinidhi 2ఎన్నికలు, రాజకీయాలు, పదవులు ఇవన్నీ ప్రజాక్షేత్రానికి సంబంధించినవే అయినా నిజానికి వీటికి సినిమాలకు అంత సులభంగా విడదీయలేని బంధం ఉంది. నలభై ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నటుడిగా, తెరవేల్పుగా ఎన్టీఆర్ సాధించిన తిరుగు లేని ఛరిష్మా ఆయన్ని ప్రజలకు త్వరగా చేరువ చేసింది. ఆపై సమాజానికి సేవ చేయాలన్న తపన అధికార పీఠాన్ని కట్టబెట్టింది.

నారా రోహిత్ ఇవాళ ప్రతినిధి 2 ప్రకటించాడు. టీవీ 5 మూర్తి దర్శకత్వ బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. రెగ్యులర్ కథల జోలికి ఎప్పడూ వెళ్లని రోహిత్ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వైవిధ్యాన్ని కోరుకుంటాడు. అంటే మూర్తి చెప్పిన దాంట్లో విషయం ఉండబట్టే తొమ్మిదేళ్ల తర్వాత తన కెరీర్ పెద్ద హిట్లలో ఒకటైన ప్రతినిధి రెండో భాగానికి ఇంత గ్యాప్ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ADVERTISEMENT

ఇక్కడో విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వచ్చే ఫిబ్రవరిలో యాత్ర 2 రిలీజవుతుంది. పూర్తిగా ఎలక్షన్ ఎజెండాతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వేనోళ్ళా కీర్తిస్తూ సినిమా ద్వారా ఆయన్ను అపరదేవుడిగా చూపించే ప్రయత్నం జరిగినా ఆశ్చర్యం లేదు. చూచాయగా దర్శకుడు మహి వి రాఘవ్ ఈ విషయాన్నే ప్రెస్ మీట్ లో చెప్పాడు. మరోవైపు వర్మ వ్యూహం కూడా ఇదే బాపతుకి చెందినదే.

ఎంత కాదనుకున్నా సినిమా మాధ్యమ ప్రభావం పబ్లిక్ మీద బలంగా ఉంటుంది. దానికి సమాధానం చెప్పాలంటే ప్రత్యర్థులు కూడా అదే అస్త్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కమర్షియల్ మార్కెట్ దృష్ట్యా ఆ పని చేయలేరు. చంద్రబాబునాయుడు, లోకేష్ లకు ఇది అలవాటు లేని వ్యవహారం, రంగం. సో నారా రోహిత్ తనదైన ప్లాన్ తోనే రంగంలోకి దిగినట్టు క్లారిటీగా కనిపిస్తోంది.

విడుదల తేదీని జనవరి 25 ప్రకటించారు. అంటే యాత్ర 2 కంటే ముందు వచ్చేస్తుంది. జర్నలిజం బ్యాక్ డ్రాప్ తీసుకున్నట్టు పోస్టర్ లో కనిపిస్తున్నా వర్తమాన ఏపీ రాష్ట్రపు పరిస్థితులను ఎండగడుతూ, పలు సమస్యలను హైలైట్ చేస్తూ, అధికార పార్టీ పాలనను వేలెత్తి చూపే అంశాలు ఇందులో ఉండొచ్చని వినిపిస్తోంది. నేరుగా పేర్లను ప్రస్తావించకపోయినా ఎవరినీ ఉద్దేశించినవో సులభంగానే తెలిసిపోతుంది.

ఒకవేళ ఇదంతా నిజమైతే మంచి ఎత్తుగడే. ముల్లుని ముల్లుతో తీయాలనే సామెత లాగే సినిమా ప్రచారానికి సినిమాతోనే ధీటైన కౌంటర్ ఇవ్వాలి. ప్రతినిధి 2 చేసేది అదే కావొచ్చు. ఇక్కడ బాక్సాఫీస్ లెక్కల్లో ఎవరు విజయం సాధిస్తారనేది అనవసరం. తమ ఉద్దేశాలను ఎంత బలంగా ఓటర్లలోకి తీసుకెళ్తారనేది ముఖ్యం. అందుకే యాత్ర 2 బాణానికి విరుగుడుగా ప్రతినిధి 2 విసురుతున్నట్టు కనిపిస్తోంది. రెండు ప్రశ్నలకు సమాధానం దొరికేది తెరమీదే.

ADVERTISEMENT
Latest Stories