చిత్రం: రణబాలి
M9 రేటింగ్: 2/5
విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026
తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లోవ్, ఈశ్వరీ రావు, కంచర్లపాలెం కిషోర్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: రాహుల్ సంకృతియన్
సంగీతం: అజయ్ – అతుల్
నిర్మాత: రవిశంకర్ – నవీన్ ఎర్నేని
ఛాయాగ్రహణం: జిష్ణు భట్టుచటర్జీ – నీరవ్ షా
కూర్పు: కార్తీక శ్రీనివాస్.ఆర్
విజయ్ దేవరకొండ – రాహుల్ సంకృతియన్ కాంబినేషన్ లో ట్యాక్సీవాలా తర్వాత వచ్చిన సినిమా “రణబాలి”. జానర్ కారణంగా పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ.. మంచి కంటెంట్ అయ్యుంటుందిలే అని ఆశపడ్డారు జనాలు. మరి ఆ ఆశను రాహుల్ & విజయ్ నేరవేర్చారా లేదా? అనేది చూద్దాం..!!
కథ:
టన్నుల కొద్దీ వడ్లు పండించినా తినడానికి మెతుకు అన్నం లేక నానా ఇబ్బందులుపడుతుంటారు భారతీయులు. అందుకు కారణం బ్రిటీష్ వారు ఇండియాకి పంపిన క్రూరమైన ఆఫీసర్ రిచర్డ్ (ఆర్నాల్డ్) మితిమీరిన హింసతో ఉన్న కొన్ని ధాన్యపు గింజలు కూడా లాగేసుకుంటాడు. ఈ దోపిడీ కాండ గురించి తెలుసుకున్న రణబాలి (విజయ్ దేవరకొండ) రంగంలోకి దిగి ప్రజలకి ధాన్యం తిరిగి ఇచ్చేందుకు చేసిన యుద్ధమే రణబాలి కథ.
నటీనటుల పనితీరు:
విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్, లుక్స్, మ్యానరిజమ్స్ కచ్చితంగా కొత్తగా ఉన్నాయి కానీ.. వాటిని ఆడియన్స్ అర్థం చేసుకుని ఆస్వాదించడానికి కొంచం టైమ్ పట్టింది. కొన్ని ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మాత్రం అతి కనిపించింది. ముఖ్యంగా మొరటుగా కనిపించే తీరు సహజంగా లేదు.
అయితే.. యాస విషయంలో విజయ్ ఎఫర్ట్స్ ని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాలి. పూర్తిస్థాయిలో ఆర్గానిక్ గా లేకపోయినా, కష్టపడ్డాడు కదా అనే భావన మాత్రం కచ్చితంగా కలుగుతుంది.
రష్మిక ఈ సినిమాకి మెయిన్ ఎసెట్. ఫస్టాఫ్ లో ఫన్ మొదలుకొని, సెకండాఫ్ లో ఎమోషన్ వరకు బాగా రక్తికట్టించింది. చెప్పాలంటే రష్మిక ఈ సినిమాకి మంచి రిలీఫ్ ఫ్యాక్టర్.
హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ క్రూరంగా కనిపించినప్పటికీ.. అతనికి తెలుగు డబ్బింగ్ చెప్పించడం అనేది ఎందుకో సింక్ అవ్వలేదు. కంచర్లపాలెం కిషోర్ కి మరోసారి మంచి పాత్ర దొరికింది, అతడు పూర్తిగా న్యాయం కూడా చేశాడు.
సాంకేతికవర్గం పనితీరు:
ముందుగా ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. 1870ల కాలాన్ని తెరపై ప్రెజంట్ చేయడంలో 100% విజయం సాధించారు. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చాలా అథెంటిక్ గా ఉంది. వీళ్ల వర్క్ కి మాత్రం కచ్చితంగా మంచి అప్రిసియేషన్ వస్తుంది.
కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. తెలిసిన/చాలాసార్లు చూసిన ప్రపంచమే అయినప్పటికీ, డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని ఫ్రేమ్స్ ఇంపాక్ట్ ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కరువును చూపించేప్పుడు చెట్టు కింద తల్లీబిడ్డ చనిపోయిన సీన్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించే ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే.
అయితే.. కెమెరా వర్క్ కానీ, కథ లేదా పాత్రలోని ఎమోషన్ కానీ వర్కవుట్ అవ్వకపోవడానికి కారణం అజయ్-అతుల్ నేపథ్య సంగీతం. ఏందయ్య సామీ అనే పాట తప్పితే మ్యూజిక్ పరంగా ఏదీ ఎంగేజ్ చేయలేకపోయింది. అసలు భీభత్సమైన ఎమోషన్ క్రియేట్ చేయాల్సిన కరువు దాని కారణంగా వచ్చే చావులు కూడా పేలవంగా అనిపించాయంటే కారణం మాత్రం ఈ ద్వయం అందించిన ఫీలింగ్ లేని నేపథ్య సంగీతమే. సినిమాకి ఇది బిగ్గెస్ట్ మైనస్.
మైత్రీ సంస్థ ఎక్కడా రాజీపడలేదు. ఆర్నాల్డ్ లాంటి హాలీవుడ్ యాక్టర్, లాల్ లాంటి పాపులర్ మలయాళం యాక్టర్ & బోలెడుమంది తెలిసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు, కావాల్సినన్ని సెట్టింగులు, అన్నిటికీ మించి సినిమాని పోస్ట్ పోన్ చేసి దర్శకుడికి కావాల్సినంత టైమ్ ఇచ్చి ఒక ప్రొడక్షన్ హౌస్ ఎంతవరకు చేయగలదో అన్నీ చేశారు. ఆ విషయంలో కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.
దర్శకుడు రాహుల్ సంకృతియన్ చేసిన రీసెర్చ్ వర్క్ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అయితే.. అదంతా కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా వెళ్ళిపోతుంది తప్పితే.. ఒక కథగా లేక సన్నివేశంగా ఆకట్టుకోదు. ఎంతో హృదయవిదారక సంఘటనలు కూడా పేలవంగా కనిపించాయి. డ్రామా వర్కవుట్ అవ్వకపోవడం కూడా మరో కారణం. సో, సీన్స్ గానో లేక కథగానో ఎగ్జైట్మెంట్ ఉంది కానీ.. సినిమాగా చూస్తున్నప్పుడు ఆ కనెక్టివిటీ లేదు. అందువల్ల కథకుడిగా పర్వాలేదనిపించికున్నాడు కానీ దర్శకుడిగా మాత్రం ఎంగేజ్ చేయలేక తడబడ్డాడు. ఆ తడబాటు తాలుకు ఎఫెక్ట్ సినిమాపై కాస్త గట్టిగానే పడింది.
విశ్లేషణ:
పీరియాడిక్ డ్రామా సినిమాలు, మరీ ముఖ్యంగా బ్రిటీష్ వాళ్ల ఆకృత్యాల నేపథ్య వచ్చే సినిమాలకి వర్కవుట్ అవ్వాల్సింది డ్రామా & ఎమోషన్. అవి సరిగ్గా కుదరకపోవడంతో “రణబాలి” ఒక రెగ్యులర్ డాక్యుమెంటరీ సినిమాగా మిగిలిపోయిందే కానీ.. ఆడియన్స్ కి ఒక హై ఇవ్వలేకపోయింది. దర్శకుడు కథనాన్ని నడిపించిన విధానం మరియు అజయ్-అతుల్ ల సంగీతం సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచాయి. అందువల్ల విజయ్ దేవరకొండ పడిన శ్రమ, మైత్రీ మూవీ మేకర్స్ డబ్బులు వృధా అయ్యాయని చెప్పొచ్చు.
ఓవరాల్ గా.. రంజింపజేయని రణబాలుని వీరగాథ!
M9 రేటింగ్: 2/5





