హీరోగా తన స్టామినాను పెంచుకుంటూ కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్న ‘కండల వీరుడు’ సల్మాన్ ఖాన్, మరో పక్కన నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే నవజుద్దిన్ సిద్దికి హీరోగా నిర్మిస్తున్న “ఫ్రీకీ అలీ” ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సల్మాన్ మరో సోదరుడు అర్భాజ్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.
గల్లీ క్రికెట్ ఆడుకునే అలీ అనే ఒక సామాన్యమైన వ్యక్తి, అత్యంత సంపన్నులు ఆడే గోల్ఫ్ ఆటగాడితో తలపడడమే… సింపుల్ గా చెప్పాలంటే చిత్ర మూలకధ. అయితే ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదభరితంగా ట్రైలర్ సాగడంతో ఈ ‘ఫ్రీకీ అలీ’పై అంచనాలు పెరిగాయి. సహజసిద్ధంగా ఉండే నవజుద్దిన్ సిద్దికి నటన హైలైట్ కాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ గా అమీ జాక్సన్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
‘మంజ్హి – ది మౌంటైన్ మ్యాన్’ సినిమాతో దాదాపు 100 కోట్ల క్లబ్ లో చేరిన నవజుద్దిన్ కు ఈ సినిమా కూడా అంతటి అవకాశాన్ని ఇచ్చేదిలా కనపడుతోంది. అలాగే నిర్మాత సల్మాన్ ఖాన్ కు కూడా పెట్టిన పెట్టుబడికి కాసుల వర్షం కురవడం ఖాయంగా కనపడుతోందని బాలీవుడ్ వర్గాల టాక్.



