2016వ సంవత్సరానికి తొలి హిట్ సినిమాను అందించిన “నేను.. శైలజ…” సినిమా దర్శకుడు తదుపరి సినిమా ఏమిటన్న దానిపై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లోనూ, సినీ అభిమానుల్లోనూ కన్ ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల యువ హీరో నితిన్ అధికారికంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే ఇంతలోనే మరో వార్త వెలుగు చూసింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను రామ్ మోహన్ నిర్మిస్తుండగా, వెంకటేష్ విభిన్నమైన రీతిలో చూపించబోతున్నారని ఖరారవ్వడంతో, అసలు కిషోర్ ఏ సినిమాను ముందు ప్రారంభిస్తారోనని ట్రేడ్ వర్గీయుల్లో ఓ చిన్న గందరగోళం చోటు చేసుకుంది.
ఇదంతా “నేను.. శైలజ…” సినిమా హిట్ ప్రభావమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సక్సెస్ కు ఉన్న కొలమానం అది. హిట్ సినిమా డైరెక్టర్ కావడంతో సహజంగానే తదుపరి సినిమా హీరో అన్న ఆసక్తి సినీ ప్రేమికుల్లో కూడా వ్యక్తమవుతోంది. బహుశా దీనిపై త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.





