డామిట్! దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ ఇంతేనా?

Jagan Political Strategy

రామాయణంలో కుంభకర్ణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు ‘నిర్దయ’గా ఉండే వరం ఇమ్మని కోరుకోవాలనుకుంటాడు. కానీ అంత శక్తివంతుడికి అలాంటి వరం ఇస్తే లోకానికి ప్రమాదమని సరస్వతీదేవి అతని చేత ‘నిద్ర’ కావాలని కోరుకునేలా చేసిందని మన పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

అదే విధంగా జగన్ కూడా తాను అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడిని, టీడీపీని రాజకీయంగా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయాలని ఏదో చేయబోతే మరేదో అవుతుంటుంది. ఆయన మనసులో ఒకటి కోరుకుని ఏదో చేస్తుంటే, దాని వల్ల చంద్రబాబు నాయుడు, టీడీపీకే మేలు జరుగుతుంది.

ADVERTISEMENT

టీడీపీ, జనసేనలు అమరావతికి కట్టుబడి ఉన్నందున మూడు రాజధానుల పేరుతో ఆయా ప్రాంతాల ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో ఎక్కడా చోటు లేకుండా చేయాలనుకున్నారు. కానీ అదే కారణంగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కూటమి గెలిచింది.

చంద్రబాబు నాయుడికి రాజకీయ వారసుడు లేకుండా చేస్తే టీడీపీలో గందరగోళం ఏర్పడి బలహీనపడుతుందని జగన్ భావించి, నారా లోకేష్‌ని నానా రకాలుగా అవహేళన చేయించారు.

ఆ దెబ్బకి నారా లోకేష్ రాజకీయాలు వదిలి పారిపోతారనుకుంటే, ఆ అవహేళనలు, అవమానాలనే సవాలుగా తీసుకొని ఒక్కొక్క లోపాన్ని సవరించుకొని కత్తిలా తయారయ్యారు. ఆ కత్తి ఇప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.

చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన మానసికంగా, శారీరకంగా బలహీనపడతారని, అప్పుడు ఎన్నికల్లో టీడీపీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేయవచ్చనుకున్నారు.

కానీ ఆయనని అరెస్ట్ చేయడం వల్లనే ప్రజల్లో, ముఖ్యంగా ఆయన వల్ల ఐటీ రంగంలో స్థిరపడినవారిలో, ఇంకా వివిధ వర్గాల్లో ఆయన పట్ల సానుభూతి, జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైంది.

టీడీపీ, జనసేన కలవద్దనుకున్నారు. వాటిని అడ్డుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయనే స్వయంగా వాటిని కలిపారు.

తాజాగా జగన్ ‘వచ్చే ఎన్నికల్లో అమరావతి వెర్సస్ మావిగన్’ అని ప్రకటించడంతో, ఇప్పుడే ఆయన స్వయంగా కూటమి ప్రభుత్వానికి విజయం ఖరారు చేసినట్లయింది. దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందేమిటో?

ADVERTISEMENT
Latest Stories