నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతికి సంబంధించి కేంద్రం దగ్గరున్న రహస్య ఫైల్స్ ను ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీలో నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా పత్రాలను ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ లోని ప్రత్యేక గ్యాలరీలో సందర్శకులు చూసే విధంగా ఉంచారు. మొత్తం 100 రహస్య డిజిటల్ పత్రాలు విడుదల కాగా, 12 మంది నేతాజీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.
గతంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వద్దనున్న రహస్య పత్రాలను సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలో విడుదల చేసి, కేంద్రం కూడా బయటపెట్టాలని చేసిన డిమాండ్ నెరవేరిన సందర్భంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ ప్రకటన చేశారు. “బోస్ ను జాతి నాయకుడి గౌరవానికి అన్ని విధాల అర్హులని, ఆయనను జాతి నాయకుడిగా గుర్తించాలని” ట్విట్టర్ లో పేర్కొన్నారు. మోదీ విడుదల చేసిన దస్త్రాల ద్వారా నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూస్తాయని, భావితరాలకు ఆయన గురించిన నిజాలను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మమత చెప్పారు.
ఇదిలా ఉంటే… తాజాగా విడుదల చేసిన ఫైళ్ల ద్వారా నేతాజీ మృతికి సంబంధించిన ఓ లేఖ వెలుగు చూసింది. 1962 మే 13వ తేదీన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఒక లేఖ ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మృతి చెందారన్న విషయాన్ని నేతాజీ సోదరుడు సురేష్ బోస్ కు తెలియజేసారు. నేతాజీ మరణం గురించి కచ్చితమైన, ప్రత్యక్షమైన ఆధారాలేవీ తాను పంపలేకపోతున్నానని, అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం విచారణ కమిషన్ కు అందజేశానని ఆ లేఖలో నెహ్రూ పేర్కొన్నారు. నేతాజీ బతికి ఉంటే (రహస్యంగా) ఆయనను ఆనందంతో ఇక్కడికి ఆహ్వానించవచ్చని, కానీ, అటువంటి అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయని రాశారు. విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారనే విషయాన్నే పశ్చిమ దేశాలు కూడా చెబుతున్నాయని ఆ లేఖలో నెహ్రూ రాసినట్లు ఈ ఫైళ్ల ద్వారా తెలుస్తోంది.





