నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో పెద్దగా కొత్తదనం లేనప్పటికీ ఆసాంతం ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా సినిమాని రక్తికట్టించారు దర్శకుడు. దీనితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ వస్తుంది.
సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో సినిమాల తరువాత టాలీవుడ్ కి హిట్ లేదు. ఆ తరువాత వచ్చిన ఐదు చెప్పుకోదగ్గ సినిమాలు … ఎంతమంచి వాడవురా, డిస్కో రాజా, అశ్వథామ, జాను డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. పైగా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా అనేది సంక్రాంతి తరువాత రాలేదు.
ఇప్పుడు భీష్మ ఆ లోటు పూరించే అవకాశం ఉంది. రేటింగ్స్ కూడా బెటర్ గా ఉండటం యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్దకూడా బాగా రాబట్టే అవకాశం ఉంది. నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. ఆ మాటకొస్తే 2016లో వచ్చిన అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు.
దీనితో ఈ సినిమా నితిన్ కి మంచి రిలీఫ్ అనే చెప్పుకోవాలి. పైగా ఇంకో రెండు నెలలో పెళ్లి కూడా ఉండటంతో ఇప్పుడు హ్యాపీగా పెళ్లి కొడుకు కావొచ్చు. సహజంగా ఫిబ్రవరి అనేది ఎగ్జామ్స్ సీజన్ కావడంతో టాలీవుడ్ కి డల్ సీజన్ అంటారు. మొదటి వారాంతం కలెక్షన్స్ తో సినిమా రేంజ్ ని ఒక అంచనా వెయ్యవచ్చు.





