ప్రస్తుత కాలంలో ఫేస్ బుక్, ట్విట్టర్లను ఉపయోగించని హీరో, హీరోయిన్లు ఎంతమంది ఉంటారు? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే కాసేపు దీర్ఘంగా ఆలోచించాల్సిందే. అంతలా సెలబ్రిటీలను ప్రభావితం చేస్తోంది సోషల్ మీడియా. అయితే వీటన్నింటికి తానూ మాత్రం బహు దూరం అంటోంది ఓ ముద్దుగుమ్మ.
ఒక్క పెద్ద హీరోతో కూడా నటించకపోయినా సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నిత్యామీనన్, తాజాగా ఓ మీడియా ప్రముఖుడు చేసిన ఇంటర్వ్యూలో ఫేస్ బుక్, ట్విట్టర్ వినియోగంపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
“ఫేస్ బుక్, ట్విట్టర్ వి వాడటం సమయాన్ని వృధా చేసుకోవడమేనని, నా కాలేజ్ సమయంలోనే నా ఫేస్ బుక్ అకౌంట్ డిలిట్ చేసేసానని, అసలు కంప్యూటర్ చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుందని, ఈ టెక్నికల్ విషయాలకు తానూ చాలా దూరంగా ఉంటానని, వీటికి బదులు పచ్చదనంతో కూడిన చెట్లు చూడటం తనకు ఇష్టమని, షూటింగ్ షాట్ మధ్యలో కూడా తన మనుషులను పరిశీలిస్తుంటానని, మొబైల్ ఫోన్ కూడా తక్కువగా వాడతానని, అది కేవలం బేసిక్ కమ్యూనికేషన్ కోసమేనని” చెప్తూ చిరునవ్వులు చిందించింది.
ఈ డైలాగ్స్ అన్ని వింటుంటే, ఈ ముద్దుగుమ్మ నటించిన “అలా… మొదలైంది…” సినిమాలో సన్నివేశం గుర్తుకు వస్తుందా! ఆ సన్నివేశంలో నిత్యా నటించలేదు, జీవించింది అని అర్థమవుతోంది కదా! బహుశా అందుకే ఆ సన్నివేశం అంత అద్భుతంగా వచ్చిందేమో కదా! అయితే ఈ ముద్దుగుమ్మ చెప్పిన విషయాలలో వాస్తముందన్న విషయం అందరికీ తెలిసిందే అయినా… వాటికి అతీతంగా జీవనం సాగించడం మాత్రం సాధ్యం కాదు కదా!



