కెరీర్ గ్రాఫ్ పైపైకి సాగిపోతున్న నేపధ్యంలో విడుదలైన విజయ్ దేవరకొండ “నోటా” సినిమా కధ దాదాపుగా ముగిసినట్లే. చాలా వీక్ టాక్ తో మొదలైన ‘నోటా’ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే… కేవలం తొలి రోజు ఓపెనింగ్స్ మాత్రమే. ఇటీవల విడుదలైన నాని ‘దేవదాస్’ను అధిగమించిన ‘నోటా’ కలెక్షన్స్ రెండవ రోజు నుండే క్షీణించిపోయాయి.
[m9ad]
సెలవు రోజు అయిన ఆదివారం కూడా కలెక్షన్స్ లో వ్యత్యాసం లేకపోవడంతో, విజయ్ దేవరకొండకు కమర్షియల్ గా తొలి దెబ్బ తగిలినట్లే. తమిళ దర్శకులను నమ్ముకుని భారీ ఆశలతో సినిమాను ‘ఓకే’ చేసి భంగపాటుకు గురైన హీరోల జాబితాలో తన పేరును కూడా విజయ్ దేవరకొండ విజయవంతంగా లిఖించుకున్నాడు.
ఏపీ, తెలంగాణాలతో పాటు యుఎస్ లో కూడా ఈ సినిమా భారీ నష్టాలనే చవిచూసింది. ప్రీమియర్స్ పరంగా ‘పాస్’ మార్కులు వేయించుకున్నప్పటికీ, వీకెండ్ కలెక్షన్స్ భారీ నష్టాలను మిగిల్చాయని తేటతెల్లమైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తొలి వీకెండ్ ముగిసేసరికి పట్టుమని 10 కోట్లు షేర్ కూడా సొంతం చేసుకోలేకపోవడంతో, ప్రేక్షకులు ‘టాటా’ చెప్పేసారని స్పష్టమైంది.



