ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టును బంగ్లాదేశ్ ఓడించడం పట్ల భారత్ లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎప్పుడూ పాక్ ఓటమిని కాంక్షించే భారతీయులు, ఈ సారి మాత్రం కాస్త ఎక్కువగానే నిరుత్సాహపడ్డారు. ఈ మ్యాచ్ లో బంగ్లాపై విజయం సాధించడం ద్వారా ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకుని, ఇండియాతో తలపడుతుందనుకున్న పాకిస్తాన్ చేతులెత్తేయడంతో భారత క్రికెట్ అభిమానులు నిరాశను వ్యక్తపరుస్తున్నారు.
చాలా అరుదుగా జరిగే ఇండియా – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ల కోసం క్రికెట్ ప్రేమికులు కాసుకుని కూర్చుంటారు. ఆ క్రమంలోనే ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లలో కూడా తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా సునాయాస విజయం సాధించడంతో మ్యాచ్ చప్పపడిపోయింది. అయితే, ఇండియా – పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడితే వీక్షించాలని చాలా మంది భావించారు. బంగ్లాపై గెలిస్తే బహుశా అదే జరిగేదేమో! కానీ సీన్ రివర్స్ కావడంతో బంగ్లాపై గెలవలేక పాక్ ఇంటి ముఖం పట్టింది. అంతేకాదు, పోతూ పోతూ శ్రీలంక జట్టును కూడా తనతో పాటు పట్టుకుపోతోంది.
సెమీ ఫైనల్స్ లాంటి మ్యాచ్ లో పాకిస్తాన్ ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ జట్టు, ఫైనల్లో భారత్ ను కూడా ఖంగు తినిపించే ఉద్దేశంలో ఉన్నారు. నిజానికి ఈ సిరీస్ మొదటి మ్యాచ్ లోనూ తొలి పది ఓవర్లలో బంగ్లా జట్టు టీమిండియాపై పూర్తి ఆధిపత్యం కొనసాగింది. కానీ మలి ఓవర్లలో పుంజుకున్న భారత జట్టు భారీ స్కోర్ నమోదు చేయడం, ఆ తర్వాత మ్యాచ్ ను వశం చేసుకోవడం జరిగిపోయింది. మరి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటారో లేదో తెలియాలంటే ఆదివారం నాటి వరకు వెయిట్ చేయాల్సిందే!



