‘కాపు ఐక్యగర్జన’లో ఏర్పడిన పర్యవసానాల దృష్ట్యా కేరళ నుండి హటాత్తుగా వచ్చి మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ సామజిక బాధ్యత గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఒక సెలబ్రిటీగా పది మందిని ప్రోత్సహించడంలో తప్పు లేదు గానీ, దానిని పవన్ కూడా అనుసరిస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.
షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన పవన్, తదుపరి రోజు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది. “ఓటు అనేది సామాన్యుడి చేతిలో ఆయుధం, దీని ద్వారానే మన తల రాతను మార్చుకోవాలి” అంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేసిన పవన్, తానే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల పవన్ సామజిక బాధ్యతపై ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ నిమిత్తం వెంటనే కేరళ వెళ్ళిపోయి ఉంటారని, అందుకే పోలింగ్ లో పాల్గొనలేక పోయారని సినీ వర్గాలు కొంతవరకు సమాచారం అందిస్తున్నా, ఎలాగూ హైదరాబాద్ వచ్చారు కనుక ఓటు వేసిన తర్వాత షూటింగ్ కు వెళ్లి ఉంటే బాగుంటుందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి పవన్ వీటిని ఆలకిస్తున్నారా!?





